ENG VS IND 3rd Test: స్వల్ప లక్ష్య ఛేదన.. ఆదిలోనే టీమిండియాకు షాక్‌ | ENG VS IND 3rd Test Day 4: Jaiswal Out For Duck, Team India In Trouble | Sakshi
Sakshi News home page

ENG VS IND 3rd Test: స్వల్ప లక్ష్య ఛేదన.. ఆదిలోనే టీమిండియాకు షాక్‌

Jul 13 2025 9:56 PM | Updated on Jul 13 2025 9:56 PM

ENG VS IND 3rd Test Day 4: Jaiswal Out For Duck, Team India In Trouble

లార్డ్స్‌ టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించినట్లే సాధించి పట్టు చేజార్చుకునేలా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 192 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌.. ఆతర్వాత స్వల్ప లక్ష్య ఛేదనను తడబాటుతో మొదలుపెట్టింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ నిర్లక్ష్యమైన షాట్‌ ఆడి అనవసరంగా వికెట్‌ పారేసుకున్నాడు. 

జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆర్చర్‌రే జైస్వాల్‌ను ఔట్‌ చేశాడు. 3 ఓవర్ల తర్వాత భారత్‌ వికెట్‌ నష్టానికి 5 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌కు (5) జతగా కరుణ్‌ నాయర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

క్రికెట్‌ మరో ఛాన్స్‌ ఇవ్వు అని ప్రాధేయపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్‌ ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అయినా కరుణ్‌ రాణిస్తాడేమో చూడాలి. ఒక వేళ ఈ ఇన్నింగ్స్‌లో కరుణ్‌ బాగా ఆడకపోతే అతని స్థానం గల్లంతైనట్లే. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 188 పరుగులు చేయాలి. ఇంగ్లండ్‌ గెలుపుకు 9 వికెట్లు​ కావాలి. ఇవాల్టి ఆటలో మరో గంట మిగిలి ఉంది. ఈ గంటలో భారత్‌ వికెట్‌ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వికెట్‌ పోగొట్టుకుంటే మాత్రం ఆతర్వాత వచ్చే ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ పిచ్‌పై 193 పరుగుల లక్ష్యం మరీ అంత చిన్నదేమీ కాదు. భారత బ్యాటర్లు ఎమరపాటుగా ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లింఉకోవాల్సి వస్తుంది.

దీనికి ముందు భారత్‌ ఇంగ్లండ్‌ను 192 పరుగులకే కుప్పకూల్చింది. వాషింగ్టన్‌ సుందర్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్‌ (40), జేమీ స్మిత్‌ (8), బెన్‌ స్టోక్స్‌ (33) వికెట్లతో షోయబ్‌ బషీర్‌ (2) వికెట్ తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్‌ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్‌ ఆటగాళ్లపై అటాక్‌ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్‌ వోక్స్‌ (10), బ్రైడన్‌ కార్స్‌లను (1) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

అంతకుముందు తొలి సెషన్‌లో సిరాజ్‌, నితీశ్‌ కుమార్‌, ఆకాశ్‌దీప్‌ చెలరేగిపోయారు. డకెట్‌ (12), ఓలీ పోప్‌ను (4) సిరాజ్‌ పెవిలియన్‌కు పంపగా.. జాక్‌ క్రాలేను (22) నితీశ్‌, హ్యారీ బ్రూక్‌ను (23) ఆకాశ్‌దీప్ ఔట్‌ చేశారు.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్‌ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తరఫున రూట్‌ (104), జేమీ స్మిత్‌ (51), బ్రైడన్‌ కార్స్‌ (56) సత్తా చాటగా.. భారత్‌ తరఫున కేఎల్‌ రాహుల్‌ (100), పంత్‌ (74), జడేజా (72) రాణించారు. 

బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ పతనాన్ని శాశించగా.. సిరాజ్‌, నితీశ్‌ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో క్రాలే 18, డకెట్‌ 23, ఓలీ పోప్‌ 44, హ్యారీ బ్రూక్‌ 11, బెన్‌ స్టోక్స్‌ 44, క్రిస్‌ వోక్స్‌ 0, జోఫ్రా ఆర్చర్‌ 4 పరుగులకు ఔటయ్యారు. 

భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 13, కరుణ్‌ నాయర్‌ 40, శుభ్‌మన్‌ గిల్‌ 16, నితీశ్‌ రెడ్డి 30, వాషింగ్టన్‌ సుందర్‌ 23, ఆకాశ్‌దీప్‌ 7, బుమ్రా 0, సిరాజ్‌ 0 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ 3, ఆర్చర్‌, స్టోక్స్‌ తలో 2, కార్స్‌, బషీర్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement