
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్‌ను భారీ దెబ్బేశాడు. రెండో ఓవర్‌లోనే వరుస బంతుల్లో స్టార్ బ్యాటర్లు జో రూట్ (22), బెన్ స్టోక్స్‌లను (0) ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 88 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
DSP SIRAJ HAS TAKEN CHARGE AT EDGBASTON 🥶 pic.twitter.com/ycxlvrtuMC
— Johns. (@CricCrazyJohns) July 4, 2025
ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (31), జేమీ స్మిత్ (4) క్రీజ్‌లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 499 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్‌దీప్ 2 వికెట్లు తీశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గట్టెక్కలేదు.
ముందు రోజు (రెండో రోజు) టీ విరామం తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ ప్రారంభించగానే వరుస షాక్‌లు తగిలాయి.
బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్‌లను డకౌట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 13 పరుగులు మాత్రమే. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది.
భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.
మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.