
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు గిల్ సిద్దమయ్యాడు. స్వదేశంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో టెస్టు సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని గిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నార్త్‌జోన్ కెప్టెన్‌గా గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తాజాగా ప్రకటించిన జట్టులో గిల్‌తో పాటు యువ పేసర్లు అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ కూడా చోటు దక్కించుకున్నారు. గిల్‌కు డిప్యూటీగా అంకిత్ కుమార్ ఎంపికయ్యాడు.
ఇంగ్లండ్‌పై గడ్డపై అదుర్స్..
ఇంగ్లండ్‌పై శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అదరగొట్టాడు. ఈ పంజాబ్ ఆటగాడు కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో మంచి మార్క్‌లు కొట్టేశాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను గిల్ సారథ్యంలోని భారత జట్టు 2-2తో సమం చేసింది. సిరీస్ సమంగా ముగియడంలో గిల్‌ది కీలక పాత్ర.
ఈ సిరీస్‌లో గిల్ పరుగులు వరద పారించాడు. ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు.
ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా గిల్(430) నిలిచాడు. గిల్ ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. త్వరలోనే భారత్‌కు రానున్న గిల్.. ఈ నెల ఆఖరిలో జరగనున్న దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఆగష్టు 28- 31వరకు జరగనున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్‌జోన్‌తో నార్త్ జోన్ తలపడనుంది.
ఒకవేళ నార్త్ జోన్ సెమీఫైనల్‌కు చేరిన గిల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌లో కూడా గిల్ ఆడనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ సిరీస్‌లలో గిల్ బీజీబీజీగా గడపనున్నాడు. తొలుత ఆసియాకప్, ఆతర్వాత వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాతో వైట్‌బాల్ సిరీస్‌లలో ఆడనున్నాడు. ఆసీస్ టూర్ ముగిసిన వెంటనే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది.
దులిప్ ట్రోఫీ-2025కి నార్త్‌జోన్ జట్టు ఇదే
శుభమన్ గిల్ (కెప్టెన్), శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, యశ్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్వీర్ సింగ్ చరక్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, కన్హయ్య వాధావాన్.
చదవండి: IND vs WI: అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా!