టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్‌గా టీమిండియా బరిలో దిగనుంది. సొంతగడ్డపై ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం సూర్యకుమార్ సేనకు మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా టోర్నీకి సన్నాహకంగా న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ పాల్గొననుంది.
ఇదిలా ఉంటే.. కివీస్‌తో పాటు ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టు నుంచి సెలక్టర్లు శుబ్‌మన్ గిల్‌ను తప్పించిన విషయం తెలిసిందే. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న గిల్.. చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి తిరిగి వచ్చి వరుసగా విఫలం కావడమే ఇందుకు కారణం.
అద్భుతమైన ఆటగాడు
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత గిల్ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్ కూడా అవుతాడని అంచనా వేశాడు. ఈ సందర్భంగా గిల్ అద్భుతమైన ఆటగాడు అని క్లార్క్ ప్రశంసలు కురిపించాడు.
ఫామ్‌లేమి కారణంగానే
బియాండ్23క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ అతడు పోటీలోనే ఉన్నాడు. ప్రస్తుతం జట్టుకు అవసరమైన రీతిలో అతడు బ్యాటింగ్ చేయడం లేదన్న కారణంగా పక్కనపెట్టారు. అంతేకాదు.. టీమిండియాకు లెక్కకు మిక్కిలి ఓపెనింగ్ బ్యాటర్ ఆప్షన్లు ఉన్నాయి.
ప్రస్తుతం అతడు కెప్టెన్ కూడా కాదు. అందుకే వరల్డ్‌కప్ జట్టు నుంచి అతడిని తొలగించే సాహసం చేశారు. ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఫామ్‌లేమి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు
అయితే, ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత గిల్ జట్టులోకి తిరిగి రావడమే కాదు.. కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడొక అద్భుతమైన ప్లేయర్. ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేకపోవచ్చు. అయితే, కెప్టెన్ అయ్యేందుకు అతడికి అర్హత ఉంది. ప్రస్తుతానికి వరల్డ్‌కప్ టోర్నీ మీద దృష్టి పెట్టినందు వల్లే మేనేజ్‌మెంట్ అతడిని తప్పించింది’’ అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ స్థానంలో సూర్య, గిల్
కాగా రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టు సారథిగా అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక టెస్టుల్లో రోహిత్ రిటైర్మెంట్ తర్వాత శుబ్‌మన్ గిల్ పగ్గాలు చేపట్టగా.. గతేడాది వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం.
అయితే, క్లార్క్ అభిప్రాయపడినట్లు వరల్డ్‌కప్ తర్వాత గిల్ సూర్య స్థానాన్ని భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: T20 WC: సూర్యకుమార్ యాదవ్‌కు రోహిత్ శర్మ వార్నింగ్


