బీజింగ్: ఈ సీజన్‌లో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైనా... మరోవైపు ఏటీపీ సర్క్యూట్‌లో తన జోరు కొనసాగిస్తూ జొకోవిచ్ వరుసగా 20వ ఏడాది కనీసం ఒక్క టైటిల్ అయినా సాధించాడు. చైనా ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో 39 ఏళ్ల జొకోవిచ్ ఏడోసారి విజేతగా నిలిచాడు. తద్వారా తన ఖాతాలో 102వ సింగిల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మరో టైటిల్ సాధిస్తే జొకోవిచ్ పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103) రికార్డును సమం చేస్తాడు.
109 టైటిల్స్‌తో జిమ్మీ కానర్స్ (అమెరికా) తొలి స్థానంలో ఉన్నాడు. ఐదో సీడ్ అలెక్స్ డిమినోర్ (ఆ్రస్టేలియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ తొలి సెట్‌ను 7–6 (7/3)తో గెలిచి... రెండో సెట్‌లో 0–1తో వెనుబడిన దశలో అతని ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో జొకోవిచ్‌కు టైటిల్ లభించింది. జొకోవిచ్‌కు 7,64,750 డాలర్ల (రూ. 7 కోట్ల 39 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో జొకోవిచ్ 2009, 2010, 2012, 2013, 2014, 2015లలో చైనా ఓపెన్ టైటిల్స్ సాధించాడు.


