రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ చరిత్ర సృష్టించింది. ఈ ఇష్యూకు దరఖాస్తుల సంఖ్య కోటి మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఒక ఐపీఓకు కోటికి పైగా దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి అని సంస్థ వెల్లడించింది. ఇష్యూ ముగియడానికి ఇంకా ఐదు గంటల సమయం ఉండగానే ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం. బిడ్డింగ్ ప్రక్రియ అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దరఖాస్తులు అందుకున్న ఐపీఓగా వారీ ఎనర్జీస్ నిలిచింది. ఆ సంస్థ పబ్లిక్ ఇష్యూకు సుమారు 97 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు గతంలో నివేదికలు వెల్లడించాయి. అలాగే, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బీసీసీఎల్ వంటి సంస్థల ఐపీఓలు సుమారు 90 లక్షల దరఖాస్తులతో దేశీయంగా రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఈ రికార్డులన్నింటినీ అధిగమిస్తూ జియో ప్లాట్‌ఫామ్స్ సరికొత్త చరిత్రను లిఖించింది. బిడ్డింగ్ ముగిసే సమయానికి తుది దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగి కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసే అవకాశముంది.
ఈ అపూర్వ స్పందన జియో ప్లాట్‌ఫామ్స్‌పై ఇన్వెస్టర్లలో ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోందని సంస్థ తెలిపింది. సంపద సృష్టిలో సామాన్య భారతీయులకు సైతం భాగస్వామ్యం కల్పించాలన్న దివంగత ధీరూభాయ్ అంబానీ వారసత్వాన్ని, ముఖేశ్ అంబానీ దార్శనికతను ఈ స్పందన ముందుకు తీసుకెళ్తోందని పేర్కొంది. ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీల జన్మదినాల సందర్భంగా ఈ ఘనతను ప్రత్యేక కానుకగా అభివర్ణించింది.


