
పురుషుల ప్రపంచకప్ టోర్నీ బరిలో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్
న్యూఢిల్లీ: భారత మహిళా గ్రాండ్‌మాస్టర్, మహిళల చెస్ ప్రపంచకప్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ ఈ ఏడాది మరోసారి పురుషుల ఈవెంట్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఇటీవలే గ్రాండ్ స్విస్ టోర్నీలో పురుష గ్రాండ్‌మాస్టర్లతో పోటీపడ్డ దివ్య... అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు భారత్‌లోని గోవా వేదికగా జరిగే పురుషుల ప్రపంచకప్
టోర్నీలో బరిలోకి దిగనుంది.
వాస్తవానికి దివ్యకు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం లేకపోయినా... చివరి నిమిషంలో ఒక ప్లేయర్ వైదొలగడంతో ఆ స్థానాన్ని దివ్య దేశ్‌ముఖ్‌తో భర్తీ చేశారు. ఈ టోర్నీలో ఆడాలని మహిళల ప్రపంచ నంబర్‌వన్ హు ఇఫాన్ (చైనా), ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్‌జున్ (చైనా)లకు నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే ఈ ఇద్దరు చైనా గ్రాండ్‌మాస్టర్లు ప్రపంచకప్‌లో ఆడేందుకు రాలేమని తెలిపారు. నాకౌట్ ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 206 మంది ప్లేయర్లు పోటీపడతారు.
టాప్–3లో నిలిచిన వారు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు. భారత్ నుంచి ఈ టోర్నీలో 20 మంది ప్లేయర్లు ఆడనున్నారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్, అరవింద్ చిదంబరం, పెంటేల హరికృష్ణ, నిహాల్ సరీన్, మురళీ కార్తికేయన్, ప్రాణేశ్, ఇనియన్, ఎస్‌ఎల్ నారాయణన్, దీప్తాయన్ ఘోష్, సూర్యశేఖర గంగూలీ, కార్తీక్ వెంకటరామన్, రాజా రితి్వక్, ఆరోన్‌యక్ ఘోష్, లలిత్ బాబు, హిమల్ గుసెయిన్, హర్షవర్ధన్, నీలాశ్ సాహా పోటీపడనున్నారు.