మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఉమెన్స్ టీమ్‌పై 87 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు డ్యానీ వ్యాట్-హాడ్జ్, అమీ జోన్స్ కాస్త నెమ్మదిగా ఆడారు. క్రీజులో కుదురుకున్నాక వారిద్దరూ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఇద్దరూ మొదటి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోన్స్(53) హాఫ్ సెంచరీ చేసి ఔటైనప్పటికి వ్యాట్ మాత్రం తన దూకుడు కొనసాగించింది.
ఈ క్రమంలో వ్యాట్ తన మూడో టీ20 సెంచరీ మార్క్‌ను అందుకుంది. మొత్తంగా ఆమె 62 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వీరితో పాటు నాట్ స్కివర్ బ్రంట్(22 బంతుల్లో 46) కూడా మెరుపులు మెరిపించింది. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే అత్యధిక టీమ్ స్కోరు కావడం గమనార్హం.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ యువ బౌలర్ ఫ్రేయా కెంప్ తన సంచలన బౌలింగ్‌తో లంక మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. ఆమె కేవలం 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు స్పిన్నర్లు డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సూపర్ సెంచరీతో సత్తాచాటిన వ్యాట్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.


