రొనాల్డోకు షాక్‌.. పోర్చుగల్‌ను నిలువరించిన కాంగో | Cristiano Ronaldo frustrated as Congo earn historic World Cup point | Sakshi
Sakshi News home page

రొనాల్డోకు షాక్‌.. పోర్చుగల్‌ను నిలువరించిన కాంగో

Jun 18 2026 3:44 AM | Updated on Jun 18 2026 3:44 AM

Cristiano Ronaldo frustrated as Congo earn historic World Cup point

ఫిఫా ప్రపంచకప్‌ 2026 గ్రూప్‌-కేలో సంచలన ఫలితం నమోదైంది. స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్‌ జట్టును పసికూన డీఆర్‌ కాంగో 1-1 గోల్స్‌తో నిలువరించింది. హ్యూస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ పూర్తి ఆధిపత్యం చలాయించినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. కెప్టెన్‌ రొనాల్డో పూర్తి 90 నిమిషాలు ఆడినా, ప్రత్యర్థి రక్షణను ఛేదించలేక నిరాశ చెందాడు.

మ్యాచ్‌ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే పోర్చుగల్‌కు ఆధిక్యం లభించింది. మిడ్‌ఫీల్డర్‌ జోవా నెవిస్‌ హెడర్‌తో గోల్‌ సాధించి జట్టును ముందంజలో నిలిపాడు. అయితే తొలి అర్ద భాగం ముగియడానికి క్షణాల ముందు కాంగో తరఫున యోనే విస్సా అద్భుత హెడర్‌తో గోల్‌ చేసి స్కోరును సమం చేశాడు.

రెండో అర్థంలో పోర్చుగల్‌ బంతిపై అధిక నియంత్రణ సాధించి పలుమార్లు దాడులు చేసినా గోల్‌గా మలచలేకపోయింది. దీంతో కాంగో చారిత్రాత్మక ఫలితం సాధించింది. 1974 ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి ఓ పాయింట్‌ ఖాతాలో వేసుకుంది.

మరోవైపు నాకౌట్‌ దశకు చేరాలంటే పోర్చుగల్‌ మిగిలిన గ్రూప్‌ మ్యాచ్‌ల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రొనాల్డోకు ఇది చివరి ప్రపంచకప్‌గా భావిస్తున్న నేపథ్యంలో తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని కోల్పోవడం అభిమానులను నిరాశ కలిగించింది.

జోవా నెవిస్‌ రికార్డు
కాంగోపై గోల్‌తో పోర్చుగల్ యువ మిడ్‌ఫీల్డర్‌ జోవా నెవిస్‌ అరుదైన ఘనత సాధించాడు. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో గోల్‌ చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన పోర్చుగీస్‌ ఆటగాడిగా నిలిచాడు.

21 సంవత్సరాలు 263 రోజుల వయసులో నెవిస్‌ ఈ ఘనత సాధించాడు. 
ఈ జాబితాలో దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. 2006 ప్రపంచకప్‌లో 21 సంవత్సరాలు 132 రోజుల వయసులో రొనాల్డో గోల్‌ సాధించాడు. రెండో స్థానంలో రామోస్‌ ఉన్నాడు. అతడు 2022 ప్రపంచకప్‌లో 21 సంవత్సరాలు 169 రోజుల వయసులో గోల్‌ నమోదు చేశాడు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement