
విండీస్ టీ20 దిగ్గజం కీరన్ పోలార్డ్ (Kieron Pollard) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్‌లో 400 క్యాచ్‌లు అందుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పాడు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025 ఫైనల్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టిన అనంతరం పోలార్డ్ టీ20 క్యాచ్‌ల సంఖ్య 401కి (720 మ్యాచ్‌ల్లో) చేరింది.
ప్రపంచంలో ఏ వికెట్‌కీపర్ కానీ, ఫీల్డర్ కానీ ఇన్ని క్యాచ్‌లు పట్టలేదు. ఈ రికార్డుకు సంబంధించి పోలార్డ్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. 321 క్యాచ్‌లతో డేవిడ్ మిల్లర్ రెండో స్థానంలో ఉన్నాడు.
విండీస్ తరఫున అంతర్జాతీయ టీ20లతో పాటు ఐపీఎల్, సీపీఎల్ తదితర టీ20 లీగ్‌ల్లో కలిపి పోలార్డ్ ఈ అరుదైన ఘనత సాధించాడు. పోలీ ఈ ఫీట్‌ను సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ విజయం సాధించి, ఐదోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ అమెజాన్ వారియర్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగా.. నైట్‌రైడర్స్ మరో 2 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టి వారియర్స్‌ను దెబ్బకొట్టిన పోలార్డ్.. బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 21; 3 సిక్సర్లు) ఆడి నైట్‌రైడర్స్ గెలుపును ఖరారు చేశాడు.
ఈ ఎడిషన్ ఆధ్యాంతం ఇదే ప్రదర్శనలతో చెలరేగినందుకు గానూ పోలార్డ్‌కే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ ఎడిషన్‌తో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 175 స్ట్రయిక్‌రేట్‌తో 383 పరుగులు చేశాడు. ఇందులో 36 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో ఇన్ని సిక్సర్లు ఎవరూ బాదలేదు.
నైట్‌రైడర్స్ గెలుపుతో పోలార్డ్ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ (18) గెలిచిన ఆటగాడిగా సహచరుడు డ్వేన్ బ్రావో (17) రికార్డును అధిగమించాడు. టైటిల్ గెలిచిన నైట్‌రైడర్స్‌కు బ్రావో కోచ్ కావడం విశేషం.