
ఇంగ్లండ్ (England) స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
బ్యాడ్జ్ (మూడు సింహాలు) కోసం 15 ఏళ్ల పాటు అంకితభావంతో సేవలందించిన Wizzకు (వోక్స్ ముద్దు పేరు) అంతర్జాతీయ రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది.
నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల వోక్స్ స్వతహాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
ఈసీబీ నాకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, కౌంటీ క్రికెట్ ఆడతాను. అలాగే ఫ్రాంచైజీ లీగ్‌ల్లో కూడా అవకాశాల కోసం వెతుకుతానంటూ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశాడు.
వోక్స్ ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సిరీస్‌లోని ఐదో టెస్ట్ తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా అతని భుజం మిస్ లొకేట్ అయ్యింది. అయినా అతను ఐదో రోజు జట్టు ఒంటిచేత్తో బరిలోకి దిగి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
2011లో వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వోక్స్.. 62 టెస్ట్‌లు, 122 వన్డేలు, 33 టీ20లు ఆడాడు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వోక్స్.. టెస్ట్‌ల్లో సెంచరీ, 7 అర్ద సెంచరీలు.. వన్డేల్లో 6 అర్ద సెంచరీలు చేశాడు.
టెస్ట్‌ల్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 192 వికెట్లు.. వన్డేల్లో 3 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 173 వికెట్లు.. టీ20ల్లో 31 వికెట్లు పడగొట్టాడు. వోక్స్‌కు ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉంది. 2017 అరంగేట్రం చేసి వివిధ ఫ్రాంచైజీల తరఫున 21 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీశాడు.
మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్‌కు అపురూప విజయాలు అందించిన వోక్స్.. ఇంగ్లండ్ గెలిచిన 2022 టీ20 ప్రపంచకప్లో కీలక పాత్ర పోషించాడు.
చదవండి: రేపటి నుంచి క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం