
39 ఏళ్ల జింబాబ్వే (Zimbabwe) వెటరన్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ (Brendan Taylor) లేటు వయసులోనూ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్‌లో (ICC Mens T20 World Cup Africa Regional Final 2025) బోట్స్‌వానాపై (Botswana) 46 శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో టేలర్ మరో 11 పరుగులు చేసుంటే టీ20ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. అయితే అనూహ్యంగా అతను 123 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్‌గా తప్పుకున్నాడు. ఈ రికార్డు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా పేరిట ఉంది. రజా 2024లో గాంబియాపై 133 పరుగులు చేశాడు. గత 21 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టేలర్.. ఐసీసీ నిషేధం ముగించుకుని మూడేళ్ల తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు.
బోట్స్‌వానాతో మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. బ్రెండన్ టేలర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ (33 బంతుల్లో 65) కూడా అర్ద సెంచరీతో మెరిశాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బోట్స్‌వానా ఆది నుంచే చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 89 పరుగులకే చేసింది. ఫలితంగా జింబాబ్వే 170 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. గత టీ20 వరల్డ్‌కప్‌కు (2024) అర్హత సాధించని జింబాబ్వే.. ఈసారి (2026) ఎలాగైనా వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ జట్టు 2022లో తమ చివరి ఐసీసీ టోర్నీ ఆడింది.
చదవండి: Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం