
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో బెంగాల్ వారియర్స్ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో బెంగాల్ వారియర్స్ 48–42 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌పై విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ 22 పాయింట్లతో విజృంభించడంతో జట్టు సునాయాసంగా గెలుపొందింది. హిమాన్షు నర్వాల్, అశీష్ మాలిక్ చెరో 5 పాయింట్లతో సారథికి అండగా నిలిచారు. పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 15 పాయింట్లు, మణిందర్ సింగ్ 12 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు రెయిడింగ్‌లో 29 పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో ముందంజ వేసిన బెంగాల్‌ను విజయం వరించింది. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన బెంగాల్ వారియర్స్ 3 విజయాలు, 5 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక పట్నా 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 6 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి 11వ స్థానంలో ఉంది.
మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 37–28 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. తలైవాస్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లు సాధించగా... పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 8 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో జైపూర్ అంచె పోటీలు ముగియగా... ఇక చైన్నై వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్‌లో ఆదివారం విశ్రాంతి దినం కాగా... సోమవారం జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీతో హర్యానా స్టీలర్స్ తలపడనున్నాయి.