బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ అసహనం
భారత హెడ్ కోచ్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
గువాహటి: తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో వస్తున్న తీవ్ర విమర్శలపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ అసహనం వ్యక్తం చేశాడు. కొందరు పనిగట్టుకొని గంభీర్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అతను వ్యాఖ్యానించాడు. భారత జట్టు పరాజయంలో ఆటగాళ్ల పాత్రను వదిలి కోచ్‌ను లక్ష్యంగా చేసుకోవడంలో అర్థం లేదని కొటక్ అన్నాడు. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనున్న నేపథ్యంలో అతను గురువారం మీడియాతో మాట్లాడాడు.
‘గంభీర్, గంభీర్ అంటూ ఒకే వ్యక్తిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. నేను కూడా సహాయక సిబ్బందిలో భాగం కాబట్టి చాలా బాధగా ఉంది. కొందరికి తమ వ్యక్తిగత అజెండాలు ఉండవచ్చు. అందుకే పనిగట్టుకొని ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది’ అని కొటక్ స్పందించాడు. ఓటమి బాధ్యతను గంభీర్ తన మీదకు వేసుకున్నాడని కొటక్ గుర్తు చేశాడు.
‘మ్యాచ్ ఓడిపోయాక ఫలానా బ్యాటర్ బాగా ఆడలేదని లేదా ఫలానా బౌలర్ ఇలా ఆడలేదని ఎవరూ విమర్శించడం లేదు. బ్యాటింగ్‌లో ఇలా ఉంటే బాగుండేదని ఎవరూ సూచించడం లేదు. కోల్‌కతాలో పిచ్ గురించి మాట్లాడుతూ గంభీర్ ఓటమి బాధ్యత అంతా తన మీద వేసుకున్నాడు.
క్యురేటర్‌పై ఎవరూ విమర్శలు చేయకుండా కాపాడేందుకే అతను ఇలా చేశాడు’ అని తమ హెడ్ కోచ్‌ను సితాన్షు వెనకేసుకొచ్చాడు. బ్యాటర్ క్రీజ్‌లోకి వెళ్లేటప్పుడు ఇలాగే ఆడాలని తాము చెప్పలేమని, పరిస్థితిని బట్టి అతను తన ఆటను మార్చుకుంటాడని కోచ్ అన్నాడు.
నేడు గిల్‌కు ఫిట్‌నెస్ పరీక్ష
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రెండో టెస్టు నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయంగానే అనిపిస్తున్నా... టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదు. కోల్‌కతా టెస్టు రెండో రోజు మెడ నొప్పితో తప్పుకున్న అనంతరం ఇప్పటి వరకు గిల్‌కు చికిత్స కొనసాగుతూనే ఉంది. అతను ఆ తర్వాత ఒక్కసారి కూడా మైదానంలోకి దిగలేదు. అయితే మ్యాచ్‌కు ముందు రోజు గిల్‌ను ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తామని కొటక్ వెల్లడించాడు.
‘గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. అయితే అతను ఆడే విషయంపై టీమ్ వైద్యులు, ఫిజియో నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు సాయంత్రం ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ కోలుకున్నా... టెస్టు మధ్యలో మెడ నొప్పి తిరగబడితే కష్టం కదా. గిల్ లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటే’ అని సితాన్షు వివరించాడు.


