ఢాకా (Dhaka) వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh)-ఐర్లాండ్ (Bangladesh vs Ireland) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు (నవంబర్ 21) ఆటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా భూకంపం (Earth Quake) సంభవించడంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు.
మ్యాచ్ ఉన్నపళంగా ఆగిపోయింది. ఆటగాళ్లు, అంపైర్లు బౌండరీ లైన్ వైపు పరుగులు పెట్టారు. కొందరేమో మైదానంలోనే కింద పడుకుండిపోయారు.
ప్రేక్షకులు ఏం జరుగుతుందో అర్దం కాక స్టేడియం బయటికి లగెత్తారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మూడు, నాలుగు నిమిషాల భూకంపం ధాటి తగ్గడంతో సాధారణ పరిస్థితి నెలకొంది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఈ షాకింగ్ ఘటన ఐర్లాండ్ ఇన్నింగ్స్ 56వ ఓవర్ రెండో బంతి బౌల్ చేస్తుండగా చోటు చేసుకుంది.
కాగా, ఇవాళ ఉదయం 10:08 గంటల సమయంలో బంగ్లాదేశ్‌లోని ఢాకా నగరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. భూప్రకంపనల కారణంగా ఢాకాలోని పలు భవనాలు కూలిపోయాయి. ఇందులో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పట్టు సాధించింది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసి, 281 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్.. ఆతర్వాత ఐర్లాండ్‌ను 265 పరుగులకే పరిమితం చేసి 211 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. రెండు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో తొలి టెస్ట్ గెలిచిన బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. బీసీసీఐ అధికారిక ప్రకటన


