ఈశాన్య భారతదేశంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రంతో పాటు మెఘాలయ, అరుణాచలప్రదేశ్, ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపం ప్రభావం స్పష్టంగా కనిపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఈ భూకంపం జనవరి 5, 2026న ఉదయం 04:17:40 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం అసోంలోని మోరీగావ్ (Morigaon) ప్రాంతంగా గుర్తించారు. భూకంపం భూమి అడుగున సుమారు 50 కిలోమీటర్ల లోతులోసంభవించింది. ఖచ్చితమైన స్థానం అక్షాంశం 26.37 N , రేఖాంశం 92.29 E వద్దగా నమోదు చేశారు.
అసోం, మెఘాలయ, అరుణాచలప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల పలు ప్రాంతాల్లో భూకంపం కారణంగా ప్రజలు భయానికి గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామున వచ్చిన ఈ ప్రకంపనలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. అయితే ఇప్పటివరకు ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. స్థానిక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ భూకంపం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలను ఒక్కసారిగా భయాందోళనలకు గురి చేసినప్పటికీ, పెద్దగా నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.


