గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సెకెండ్ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో భారత జట్టు సారథిగా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు.
జట్టుతో పాటు గిల్ గువహటికి వెళ్లినప్పటికి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనుంది. గిల్ తన గాయం నుంచి కోలుకోనేంందుకు తిరిగి ముంబైకి వెళ్లనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత కెప్టెన్ ముంబైలోని డాక్టర్ దిన్షా పార్దివాలా వద్ద చికిత్స పొందనున్నాడు. దీంతో గిల్ నవంబర్ 30 నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశముంది.
గిల్‌కు ఏమైందంటే?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్‌కు మెడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అతడిని కోల్‌కతాలోని వుడ్స్‌ల్యాండ్ అస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ తర్వాత అతడిని అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
అనంతరం నెక్ బ్యాండ్ లేకుండా గిల్ కన్పించడంతో రెండో టెస్టులో ఆడుతాడని చాలా భావించారు. అతడు జట్టుతో పాటు గువహటికి వెళ్లడంతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తాయి. కానీ అతడికి ఇంకా పూర్తి స్ధాయిలో నొప్పి తగ్గలేదు. అందుకే అతడిని రెండో టెస్టు నుంచి బీసీసీఐ తప్పించింది.
38వ టెస్టు కెప్టెన్‌గా..
టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తొలిసారి చేపట్టేందుకు పంత్ సిద్దమయ్యాడు. టీ20 క్రికెట్‌లో సారథిగా అపారమైన అనుభవం కలిగి ఉన్న పంత్.. సంప్రాదాయ క్రికెట్‌లో ఎలా జట్టును నడిపిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా కెప్టెన్‌గా పంత్ వ్యవహరించాడు.
2017-18 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఇషాంత్ శర్మ గైర్హజరీలో ఢిల్లీ జట్టును పంత్ నడిపించాడు. ఆ సీజన్‌లో పంత్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా నిరాశపరిచినప్పటికి.. అతడి నాయకత్వంలో ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. పంత్ ఇప్పటివరకు ఐదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించగా.. రెండు విజయాలు, ఒక ఓటమిని ఎదుర్కొన్నాడు.
రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిసింది. అదేవిధంగా గతంలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా పంత్ బాధ్యతలు నిర్వర్తించాడు. సీనియర్ ఆటగాళ్లు గైర్హజరీలో ఐదు టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ ఐదు మ్యాచ్‌లలో భారత్ రెండింట విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.
ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఐపీఎల్‌లో పంత్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా పంత్ పనిచేశాడు. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంత్ 57 మ్యాచ్‌లలో నాయకత్వం వహించాడు.
ఇందులో 30 విజయాలు, 27 ఓటములు ఉన్నాయి. అతడి విన్నింగ్ శాతం 52.63గా ఉంది. టీ20ల్లో కెప్టెన్‌గా సాహసోపేతమైన నిర్ణయాలు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లు సెట్ చేయడంలో పంత్‌ది దిట్ట. మరి టెస్టుల్లో అదే మైండ్ సెట్‌తో వెళ్తాడా లేదా? తన శైలికి భిన్నంగా జట్టును నడిపిస్తాడో వేచి చూడాలి. కాగా భారత టెస్టు జట్టుకు 38వ కెప్టెన్‌గా పంత్ రికార్డులకెక్కాడు.


