
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నివేదికల ప్రకారం.. సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ 2025-26 ఎడిషన్ కోసం బాబర్‌తో 4,20,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తానీ కరెన్సీలో ఇది 7.7 కోట్లు. భారత కరెన్సీలో రూ.2.35 కోట్లు.
బాబర్‌తో సిక్సర్స్ డ్రాఫ్ట్ (వేలం) కంటే ముందే ఒప్పందం చేసుకుంది (ప్రీ డ్రాఫ్ట్ సైనింగ్). బీబీఎల్‌లో ఓవర్సీస్ డ్రాఫ్ట్ కంటే ముందే ప్రీ డ్రాఫ్ట్ కింద విదేశీ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకోవచ్చు. సిక్సర్స్ బాబర్‌తో పాటు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కూడా ఇలాగే ఒప్పందం చేసుకుంది. బీబీఎల్‌లో బాబర్‌కు ఇదే తొలి డీల్. ఈ సీజన్‌తోనే అతను ఆసీస్ దేశవాలీ టీ20 లీగ్‌లో అరంగేట్రం చేస్తాడు. ఈ సీజన్ బీబీఎల్ డ్రాఫ్ట్ జూన్ 19న జరుగనుంది.
బీబీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు
బాబర్ బీబీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పాక్ మీడియా డప్పు కొట్టుకుంటుంది. బీబీఎల్‌లో అత్యధిక ధర పలికే ప్లాటినం కేటగిరీలో ఆటగాళ్లకు 3,40,000 ఆస్ట్రేలియన్ డాలర్లు పారితోషికంగా ఇస్తారు. అయితే బాబర్‌తో సిక్సర్స్ ఇంతకంటే 80,000 డాలర్లు అధికంగా ఒప్పందం చేసుకుంది. బీబీఎల్ చరిత్రలో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా డి'ఆర్సీ షార్ట్ పేరిట రికార్డు ఉంది. అతనికి 2023-24 సీజన్‌లో హోబర్ట్ హరికేన్స్ 2,58,900 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించింది.
బీబీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 ఆటగాళ్ల జాబితా:
డి'ఆర్సీ షార్ట్ – $2,58,900 (హోబార్ట్ హరికేన్స్)
ఆండ్రూ టై – $2,46,800 (పెర్త్ స్కార్చర్స్)
మార్కస్ స్టోయినిస్ – $2,27,900 (మెల్బోర్న్ స్టార్స్)
క్రిస్ లిన్ – $2,02,000 (బ్రిస్బేన్ హీట్)
జో రూట్ – $2,00,000 (సిడ్నీ థండర్)
బీబీఎల్‌లో ఆటగాళ్ల జీతాల శ్రేణుల వివరాలు:
ప్లాటినం: $3,40,000
గోల్డ్: $2,60,000
సిల్వర్: $1,75,000
కాంస్యం: $1,00,000
ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కంటే తక్కువే
బీబీఎల్‌లో బాబర్ అత్యధిక ధర పలికిన ఆటగాడే అయినా, ఐపీఎల్‌లో ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు లభించే మొత్తం కంటే తక్కువే తీసుకుంటాడు. భారత కరెన్సీలో బాబర్‌కు 2.35 కోట్లు (బీబీఎల్ పారితోషికం) లభిస్తే.. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు, అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్యకు రూ.3.5 కోట్లు లభిస్తుంది.
ఇదిలా ఉంటే, ప్రపంచవాప్తంగా ఉండే చాలా క్రికెట్ లీగ్‌ల్లో ఆడే (పీఎస్‌ఎల్, సీపీఎల్, ఎల్‌పీఎల్, బీపీఎల్, బీబీఎల్) బాబర్‌కు స్వదేశ టీ20 జట్టులో చోటు కరువైంది. పాకిస్తాన్ టీ20 సెటప్ నుంచి బాబర్‌తో పాటు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిని పక్కన పెట్టారు.