
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం ఎడిషన్ (2024) ప్రియాంశ్ ఆర్య లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సీజన్‌లో ప్రియాంశ్ మెరుపులు ఆకాశాన్ని తాకాయి. ఫలితంగా అతనికి ఐపీఎల్ ఆఫర్ వచ్చింది.
ప్రియాంశ్ డీపీఎల్ 2024లో 198.69 స్ట్రయిక్‌రేట్‌తో 67.56 సగటున 2 విధ్వంసకర సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 608 పరుగులు చేశాడు. ఓ మ్యాచ్‌లో ప్రియాంశ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది, 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ప్రదర్శన తర్వాతే ప్రియాంశ్ వెలుగులోకి వచ్చాడు.
ఆతర్వాత ప్రియాంశ్ ఐపీఎల్ 2025లో ఏం చేశాడో అందరం చూశాం. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. సీజన్ మొత్తం నిలకడగా మెరుపులు మెరిపించి (17 మ్యాచ్‌ల్లో 179.25 స్ట్రయిక్‌రేట్‌తో 475 పరుగులు) తన జట్టును (పంజాబ్ కింగ్స్) ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.
తాజాగా ప్రియాంశ్ లాగే మరో ఆటగాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపిస్తూ ఐపీఎల్‌వైపు దూసుకొస్తున్నాడు. వెస్ట్ ఢిల్లీ లయన్స్‌కు చెందిన ఆయుశ్ దొసేజా నిన్న (ఆగస్ట్ 7) పురానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో శతక్కొట్టి ప్రియాంశ్ ఆర్యను గుర్తు చేశాడు. దీనికి ముందు మ్యాచ్‌లో కూడా దొసేజా విధ్వంసం సృష్టించాడు. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌పై 48 బంతుల్లో అజేయమైన 84 పరుగులు చేశాడు.
దొసేజా దూకుడు చూస్తుంటే అందరికీ ప్రియాంశ్ ఆర్యనే గుర్తుకు వస్తున్నాడు. అతను ఈ సీజన్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఐపీఎల్ 2026 వేలంలో హాట్ పిక్ అవుతాడు. దొసేజా ప్రదర్శనలు చూసి భారత క్రికెట్ అభిమానులు మరో ప్రియాంశ్ ఆర్య లోడింగ్ అంటూ చర్చించుకుంటున్నారు.
దొసేజా ఓ పక్క చెలరేగుతుంటే డీపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంశ్ ఆర్య మాత్రం ఈ సీజన్‌లో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.