Photo Credit: BCCI Twitter
ఆసియా గేమ్స్‌లో భాగంగా రేపు జరగనున్న ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు స్వర్ణ పతక పోరు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆట పరంగా చూస్తే పాకిస్తాన్ కంటే భారత్ అన్నింటిలో మెరుగ్గా కనిపిస్తుంది. వరుసగా రెండోసారి స్వర్ణం చేజేక్కించుకోవాలని టీమిండియా భావిస్తుండగా, టీమిండియాకు పసిడి కలను దూరం చేయాలనే పట్టుదలతో పాక్ బరిలోకి దిగుతోంది.
ఐసీసీ సహా మేజర్ టోర్నీల్లో ఎక్కడ చూసుకున్నా పాకిస్తాన్‌పై భారత్‌దే స్పష్టమైన ఆధిపత్యం. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాను పాక్ ఓడించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. గతేడాది ఆసియా కప్ ఫైనల్ సందర్భాగా ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడగా, టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి భారత్‌ను ఓడించి సొంతం చేసుకోవాలన్న పాకిస్తాన్ గోల్డ్ కలను భగ్నం చేయగల ముగ్గురు భారత స్టార్ల గురించి ఒకసారి చర్చిద్దాం.
అభిషేక్ శర్మ..
ఏడాది క్రితమే తొలిసారి పాకిస్తాన్‌తో ఆడిన అభిషేక్ శర్మ ఆ జట్టుకు భయాన్ని పుట్టించాడు. పాక్‌పై ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో అతడు తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, ఉన్నంతసేపు పాక్ బౌలర్లను దంచికొట్టాడు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న ఫైనల్లో అభిషేక్ శర్మ వీరవిహారం చేస్తే మాత్రం పాక్‌కు కష్టాలు తప్పవు.
పాక్‌తో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 177.41 స్ట్రైక్‌రేట్‌తో 110 పరుగులు చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి పాక్ విధించిన భారీ టార్గెట్‌ను భారత్ సునాయాసంగా ఛేదించడంలో సహాయపడ్డాడు. అయితే గత రెండు ఇన్నింగ్స్‌ల్లో మాత్రం వరుసగా ఐదు, సున్నా స్కోర్లకే పరిమితమైనప్పటికీ, మ్యాచ్‌లో నిలదొక్కుకుంటే మాత్రం అభిషేక్ శర్మ డేంజర్ ఇన్నింగ్స్ ఆడగలడు.
జస్‌ప్రీత్ బుమ్రా..
పాకిస్తాన్‌పై బౌలింగ్‌లో టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రాకు మంచి రికార్డు ఉంది. 2023-24 మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు ప్రపంచకప్పుల్లో బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు సొంతం చేసకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో కూడా పాక్‌తో మ్యాచ్‌లో బుమ్రా తాను వేసిన తొలి రెండు ఓవర్లలోనే పాక్ పతనాన్ని శాసించాడు.
ఇప్పటివరకు బుమ్రా పాకిస్తాన్‌పై 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. తాను ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండుసార్లు మాత్రమే వికెట్ తీయడంలో విఫలమైన బుమ్రా, మిగిలిన ఆరు సందర్భాల్లో మాత్రం టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
తిలక్‌వర్మ..
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు పాకిస్తాన్‌పై అమోఘమైన రికార్డు ఉంది. గతేడాది జరిగిన ఆసియా కప్ ఫైనల్లో బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. అంతేకాదు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ తిలక్ వర్మ 25 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు పాకిస్తాన్‌పై 4 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 155 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: Asian Games 2026: రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం


