
ఆసియా కప్-2025లొ ఆతిథ్య యూఏఈ బోణీ కొట్టింది. ఇవాల్టి సాయంత్రం మ్యాచ్‌లో ఒమన్‌పై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి మూడో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పూర్తి వివరాల్లో వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్లు ముహమ్మద్ వసీం (54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు), అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించడంతో మంచి స్కోర్ చేసింది.
ఆరంభంలో ధాటిగా ఆడి 200 స్కోర్ దిశగా పయనించిన యూఏఈ.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసిఫ్ ఖాన్ (2), వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (0) నిరాశపర్చగా.. ముహమ్మద్ జోహైబ్ (21), హర్షిత్ కౌశిక్ (19 నాటౌట్) తేలికపాటి మెరుపులు మెరిపించారు. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది 2, హస్నైన్ షా, సమయ్ శ్రీవాత్సవ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఆ దశలోనే మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. ఆర్యన్ బిస్త్ (24), వినాయక్ శుక్లా (20), రామనంది (13) కొద్ది సేపు ఓటమిని వాయిదా వేయగలిగారు.
18.4 ఓవర్లలో ఆ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. జునైద్ సిద్దిఖీ 4 వికెట్లు తీసి ఒమన్‌ను దెబ్బకొట్టాడు. హైదర్ అలీ, ముహమ్మద్ జవాదుల్లా తలో 2, రోహిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు. యూఏఈ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో (సెప్టెంబర్ 17) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుకు సూపర్ 4 అవకాశాలు ఉంటాయి.