
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ గ్రూప్‌లో మూడు విజయాలతో లంక, రెండు విజయాలతో బంగ్లాదేశ్ ముందంజ వేయగా... అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్రమించింది.
‘సూపర్–4’ దశకు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో... టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (22 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. వెలలాగే వేసిన చివరి ఓవర్లో నబీ ఏకంగా 5 సిక్స్‌లు కొట్టడం బాదడం విశేషం. ఈ ఓవర్లో అతను వరుసగా 6, 6, 6, (నోబాల్), 6, 6 బాదాడు.
ఇతర బ్యాటర్లలో రషీద్ ఖాన్ (24), ఇబ్రహీమ్ జద్రాన్ (24) కొన్ని పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం లంక 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించగా... కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్ (26 నాటౌట్) రాణించాడు. శనివారం జరిగే తొలి సూపర్–4 మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడతాయి.