
నేడు పాకిస్తాన్‌తో శ్రీలంక ఢీ
ఆసియా కప్ టి20 టోర్నీ
అబుదాబి: ఆసియా కప్ సూపర్–4 దశలో తమ తొలి మ్యాచ్‌ల్లో ఓడిన రెండు జట్లు కీలక సమరానికి సన్నద్ధమయ్యాయి. నేడు జరిగే పోరులో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన శ్రీలంక గత పోరులో అనూహ్యంగా బంగ్లాదేశ్ చేతిలో ఓడగా... భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తయింది.
ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. సూపర్–4లో రెండో పరాజయం ఎదురైతే ముందంజ వేసే అవకాశాలు దాదాపుగా ముగిసిపోతాయి. ఈ నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం. భారత్ చేతిలో ఓడిన మ్యాచ్‌లో ఆరంభంలో పాక్ బ్యాటింగ్ మెరుగ్గానే కనిపించింది.
టాప్–3 బ్యాటర్లు ఫఖర్, ఫర్హాన్, అయూబ్ రాణించారు. అయితే జట్టు మిడిలార్డర్ మరీ పేలవంగా కనిపిస్తోంది. తలత్, నవాజ్, కెపె్టన్ సల్మాన్ ఏమాత్రం ప్రభావం చూపలేక పోతున్నారు. పాక్ బౌలింగ్ కూడా గొప్పగా లేదు. మరోవైపు శ్రీలంక కూడా బ్యాటింగ్ వైఫల్యం వల్లే బంగ్లా చేతిలో ఓటమిపాలైంది.
అయితే లీగ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే ఆ జట్టు కోలుకునే అవకాశం ఉంది. ప్రధాన బ్యాటర్లు కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, నిసాంకపై అంచనాలు ఉండగా... బౌలింగ్‌లో చమీరా, హసలంక రాణిస్తున్నారు. ఆల్‌రౌండర్‌గా షనక ప్రభావం చూపించాడు. ఇప్పటి వరకు ఆకట్టుకోని కెపె్టన్ అసలంక ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ కోరుకుంటోంది.