పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు తేలిపోయారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్ ధాటికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. స్టార్ 7 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓలీ పోప్(46), జేమీ స్మిత్(33) ఫర్వాలేదన్పించారు. అనంతరం ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రెగ్యూలర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బదులుగా మార్నస్ లబుషేన్ రావడాన్ని చూసి మైదానంలో ఉన్న ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు.
వాస్తవానికి తొలి టెస్టుకు అరంగేట్ర ఆటగాడు జేక్ వెదరాల్డ్, ఖవాజా ఓపెనర్‌లుగా ఉన్నారు. కానీ ఉస్మాన్ మాత్రం బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో అతడికి ఏమైనా గాయమైందా? అని అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. అయితే ఖావాజా బ్యాటింగ్‌కు రాకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఆఫ్‌ది ఫీల్డ్ టైమ్ పూర్తి కాకపోవడం వల్లే ఉస్మాన్ ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభించలేకపోయాడు.
రూల్స్ ఏమి చెబుతున్నాయి?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఖవాజా ఎక్కువ సమయం పాటు మైదానం వెలుపల (Off the field) ఉన్నాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఒక ప్లేయర్ బ్రేక్ పేరిట ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ సమయం మైదానం బయట ఉంటే సదరు ఆటగాడికి కొన్ని ఆంక్షలు వర్తిస్తాయి. ఎంత సమయం పాటు బయట ఉన్నాడో.. ఆ నిర్ధిష్ట సమయం పూర్తి అయ్యే వరకు బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుమతించరు.
ఇప్పుడు ఖవాజా విషయంలో అదే జరిగింది. ఇంగ్లండ్ వికెట్లు వెంటవెంటనే పడడంతో ఖవాజా ఆఫ్‌ది ఫీల్డ్ సమయాన్ని పూర్తి చేయలేకపోయాడు. దీంతో అతడు తన బ్రేక్ సమయానికి అనుగుణంగా డ్రెసింగ్‌రూమ్‌లోని ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే ఓపెనర్‌గా కాకుండా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
అయితే టాయిలెట్ బ్రేక్స్ పేరిట అతడు దాదాపుగా 20 నిమిషాల పాటు ఆఫ్‌ది ఫీల్డ్ పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈమ్యాచ్‌లో ఖవాజా తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా ఆసీస్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. ఆస్ట్రేలియా 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. బీసీసీఐ అధికారిక ప్రకటన


