PC: TG20 X
టీజీ టి20 లీగ్ పై సీవీ మిలింద్
అన్విత ఖమ్మం ఏసెస్ గెలుపుపై ధీమా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్ధమాన క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించే అందరి దృష్టిలో పడేందుకు తెలంగాణ టి20 లీగ్ (టీజీ టీ20) తగిన అవకాశం కల్పిస్తోందని పేస్ బౌలర్ సీవీ మిలింద్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్న మిలింద్... టీజీ టి20లో అన్విత ఖమ్మం ఏసెస్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్లో విజయంతో ఏసెస్ శుభారంభం చేసింది.
'టోర్నీ తొలి మ్యాచ్‌లోనే మా జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. తర్వాత మ్యాచ్‌ల్లోనూ మంచి ఫలితాలు సాధించి ఏసెస్‌కు టైటిల్ అందించాలని పట్టుదలగా ఉన్నా' అని మిలింద్ చెప్పాడు. ‘ఇతర రాష్ట్రాల టీ20 లీగ్‌లను చూసినప్పుడల్లా మన వద్ద ఇలాంటి టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అనుకునేవాళ్లం. ఎట్టకేలకు ఇప్పుడు హెచ్‌సీఏ అధికారికంగా లీగ్ జరపడం సంతోషంగా ఉంది' అని మిలింద్ వ్యాఖ్యానించారు.
ప్రతి ఏటా హెచ్‌సీఏ లీగ్స్‌లో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొంటారని... అయితే వారి ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించదని మిలింద్ అభిప్రాయపడ్డాడు. అలాంటి క్రికెటర్లకు తమ సత్తా చాటి మున్ముందు కెరీర్‌లో ఎదిగేందుకు టీజీ టి20 లీగ్ సరైన వేదిక అని అతను చెప్పాడు. ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ అంశం వేలం, వారికి దక్కిన మొత్తం గురించి కాదు. కుర్రాళ్ల ప్రతిభకు సరైన అవకాశం. ఆటగాళ్ల కోణంలో చూస్తే అన్ని విధాలా లీగ్ సరైన ప్రయత్నం' అని మిలింద్ విశ్లేషించాడు.
వ్యక్తిగతంగా చూస్తే తమ ఖమ్మం ఏసెస్ యాజమాన్యం అన్ని విధాలా టీమ్‌కు అండగా నిలిచిందని మిలింద్ వెల్లడించాడు. 'అన్విత గ్రూప్ సరైన ప్రణాళికతో టీమ్ ను సిద్ధం చేసింది. మేమంతా నగర శివార్లలో పది రోజులకు పైగా జరిగిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొన్నాం. మా టీమ్ యజమాని అనూప్ అక్కడే ఉండి టీమ్ బాండింగ్కు ఎంతో సహకరించాడు.. ఓవరాల్‌గా కూడా టోర్నీలో ఐపీఎల్ తరహా వాతావరణం కనిపించడం సానుకూలాంశం' అని మిలింద్ విశ్లేషించాడు.


