
నేడు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్
అన్ని రంగాల్లో పటిష్టంగా టీమిండియా
ప్రతీకారంపై పాక్ దృష్టి
రా.గం.8.00 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: ఆసియా కప్‌లో సరిగ్గా వారం రోజుల తర్వాత మళ్లీ భారత్, పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ సూపర్–4 దశలో భాగంగా జరిగే పోరులో ఇరు జట్లు మళ్లీ తలపడుతున్నాయి. ఏకపక్షంగా సాగిన గత మ్యాచ్‌లో భారత్ అలవోక విజయం సాధించి తమ స్థాయిని ప్రదర్శించింది. అయితే ఓటమి అనంతరం పాక్ క్రికెటర్లతో మన ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చేందుకు నిరాకరించడం, తదనంతర పరిణామాల్లో పాక్ తీవ్ర అసంతృప్తి ప్రదర్శించి వివాదానికి దారి తీయడం జరిగాయి.
ఈ నేపథ్యంలో దాయాది జట్ల పోరు సహజంగానే ఆసక్తిని రేపుతోంది. లీగ్ దశలో పాక్ ఆటతీరు చూస్తే టీమిండియాకు మళ్లీ ఎదురు ఉండకపోవచ్చు. దుబాయ్‌లో రికార్డు, పరిస్థితి బట్టి చూస్తే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మరో వైపు పాక్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఐసీసీ ఈ మ్యాచ్‌కు కూడా ఆండీ పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేయడం విశేషం.
అక్షర్ దూరం!
ఒమన్‌తో మ్యాచ్‌లో భారత్ ఇద్దరు కీలక ఆటగాళ్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతినిచ్చింది. వీరిద్దరు పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం ఖాయం. అయితే ఫీల్డింగ్ చేస్తూ తలకు దెబ్బ తగిలిన అక్షర్ పటేల్ ఆడటం సందేహంగానే ఉంది. కాబట్టి అర్ష్ దీప్, హర్షిత్ రాణాలలో ఒకరు తమ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. మిగతా తుది జట్టు కూర్పులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అభిషేక్ శర్మ దూకుడును నిలువరించడం పాక్‌కు కష్టం కావచ్చు.
అయితే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ వరుస వైఫల్యం ఒక్కటే జట్టులో ఆందోళన కలిగించే అంశం. మూడు మ్యాచుల్లోనూ అతను విఫలమయ్యాడు. గత మ్యాచ్‌లో పరిస్థితిని బట్టి నెమ్మదిగా ఆడినా...సత్తా చాటే స్థాయి సామ్సన్‌కు ఉంది. సూర్యకుమార్, పాండ్యా, దూబే, తిలక్ వర్మ బ్యాటింగ్ పదును కలిసొస్తే టీమిండియాకు ఎదురుండదు. బుమ్రా, కుల్దీప్, వరుణ్‌లు ప్రత్యర్థిని కుప్పకూల్చగల సమర్థులు.
గెలిపించేదెవరు!
బలహీన జట్లపై కూడా వంద పరుగులు దాటేందుకు పాకిస్తాన్ తిప్పలు పడుతోంది. ఇలాంటి స్థితిలో భారత్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నా... అది అంత సులువు కాదు. ప్రధాన బ్యాటర్ అయిన అయూబ్ మూడు మ్యాచ్‌లలో డకౌట్ కాగా, ఒక్కరు కూడా దూకుడుగా ఆడలేకపోతున్నారు. అసలు ఏ బ్యాటర్
నుంచి కూడా టి20 తరహా మెరుపులు రావడం లేదు.
ఫర్హాన్, హసన్, హారిస్ ప్రభావం చూపకపోగా, కెప్టెన్ సల్మాన్ ఆగాలో కూడా అలాంటి ధాటి లేదు. బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది మాత్రమే కాస్త ఫర్వాలేదనిపిస్తుండగా... మిగతా బౌలర్లలో ఎలాంటి పదును లేదు. రవూఫ్, అబ్రార్‌లను భారత్ సునాయాసంగా ఎదుర్కోగలదు. ఈ స్థితిలో పాక్ ఎలా కోలుకుంటుందో చూడాలి.