
ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పునరాగమనానికి రంగం సిద్ధమైంది. నలభై రెండేళ్ల ఈ స్పీడ్‌స్టర్ దేశీ క్రికెట్ బరిలో దిగబోతున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ 2లో భాగంగా లంకాషైర్ జట్టుకు ఆడనున్నాడు.
ఇందుకు సంబంధించి లంకాషైర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జట్టులో జేమ్స్ ఆండర్సన్‌కు చోటు ఇచ్చినట్లు వెల్లడించింది. కాగా.. గతేడాది ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో లార్డ్స్ వేదికగా జూలై నాటి టెస్టుతో ఇంగ్లండ్ జట్టుతో అతడి ప్రయాణం ముగిసిపోయింది.
ఆ తర్వాత ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టుకు ఆండర్సన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు. అయితే, ఆ పనికి కూడా స్వస్తి పలికి ఆటగాడిగా మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి డెర్బిషైర్‌తో జరిగే కౌంటీ మ్యాచ్‌తో అతడు మైదానంలో దిగుతున్నాడు.
704 వికెట్లు
కాగా 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జేమ్స్ ఆండర్సన్.. ఇంగ్లండ్ తరఫున 188 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఏకంగా 704 వికెట్లు కూల్చి.. ఈ అరుదైన మైలురాయి చేరుకున్న తొలి పేసర్‌గా చరిత్రకెక్కాడు.
అంతేకాదు ఆండర్సన్ ఒకే ఇన్నింగ్స్‌లో 32సార్లు నాలుగు వికెట్లు, 32 సార్లు ఐదు వికెట్లు, మూడుసార్లు పది వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఒకే వేదికపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గానూ రికార్డు సాధించాడు. లార్డ్స్ మైదానంలో అతడు 29 టెస్టుల్లో కలిపి 2.71 ఎకానమీతో 123 వికెట్లు తీశాడు.ఇక వన్డేల్లో 269 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. అంతర్జాతీయ టీ20లలో 18 వికెట్లు పడగొట్టాడు.
లంకాషైర్ జట్టు
మార్కస్ హ్యారిస్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, టామ్ బెయిలీ, జార్జ్ బాల్డర్‌సన్, జార్జ్ బెల్, జోష్ బొహానన్, టామ్ హార్ట్లీ, మ్యాట్ హర్ట్స్, కీటన్ జెన్నింగ్స్, మైకేల్ జోన్స్, ఆండర్సన్ ఫిలిప్, ఓలీ సటాన్, ల్యూక్ వెల్స్, విల్‌వియమ్స్.
ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా సౌతీ
మరోవైపు.. ఆండర్సన్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌతీని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రత్యేక నైపుణ్య సలహాదారుగా నియమించుకుంది. త్వరలో ఇంగ్లండ్, భారత్‌ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ వరకే ఈ నియామకం జరిగినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది.
వచ్చే నెల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్ అక్కడ ఐదు టెస్టుల ముఖాముఖి సిరీస్‌లో తలపడుతుంది. ముందుగా లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. జూలై 31 నుంచి ద ఓవల్‌లో జరిగే ఆఖరి టెస్టుతో సంప్రదాయ సిరీస్ ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో ఎంతో అనుభవజ్ఞుడైన కివీ పేసర్ సౌతీ సేవల్ని ఉపయోగించుకొని సిరీస్‌లో లబ్ధి పొందాలని ఇంగ్లండ్ బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. 36 ఏళ్ల మాజీ సీమర్ గత డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
కెరీర్‌లో 107 టెస్టులాడి 391 వికెట్లు తీశాడు. 161 వన్డేల్లో 221 వికెట్లు, 126 టీ20ల్లో 164 వికెట్లు తీసిన కివీస్ గ్రేటెస్ట్ బౌలర్ సౌతీ. భారత్‌తో సిరీస్ కంటేముందు ఇంగ్లండ్ ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికపై జింబాబ్వేతో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ నెల 22 నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది.
చదవండి: ‘రోహిత్ జట్టులో లేకపోయినా నష్టమేమీ లేదు.. అది పెద్ద విషయమే కాదు’