PC: KKR X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ శిక్షణా సిబ్బందిలో న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్‌ను చేర్చుకుంది. కాగా అభిషేక్ నాయర్‌ను ఇప్పటికే హెడ్‌కోచ్‌గా ప్రమోట్ చేసిన కేకేఆర్.. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకున్నట్లు గురువారం వెల్లడించింది.
‘వాట్సన్‌కు కేకేఆర్ కుటుంబం స్వాగతం పలుకుతోంది. ప్లేయర్‌గా, కోచ్‌గా ఈ ఆస్ట్రేలియన్‌కున్న విశేషానుభవం మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటగాడిగా నిరూపించుకున్న అతడి కోచింగ్‌లో మా జట్టు సన్నాహాలు మరో స్థాయిలో ఉంటాయని ఆశిస్తున్నాం. అతడి సేవలతో మా జట్టు ఉన్నతశిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని కోల్‌కతా ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ అన్నారు.
ఇక తన నియామకం పట్ల ఆనందం వ్యక్తం చేసిన వాట్సన్... కేకేఆర్ బృందంలో చేరేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. కోల్‌కతా మరోసారి టైటిల్ గెలిచేందుకు తనవంతు కృషి చేస్తానన్నాడు. కాగా ఈ మాజీ ఆల్‌రౌండర్ కంగారూ తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టి20ల0 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పైచిలుకు పరుగులు, 280 వికెట్లు తీశాడు. 2007, 2015 వన్డే ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు.
ఐపీఎల్‌లోనూ వాట్సన్‌ది సుదీర్ఘమైన కెరీర్ అని చెప్పొచ్చు. ప్రారంభ ఐపీఎల్ సీజన్ 2008 నుంచి 2020 వరకు 12 ఏళ్ల పాటు లీగ్ క్రికెట్ ఆడాడు. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ టైటిళ్లలోనూ భాగమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సైతం అతను ప్రాతినిధ్యం వహించాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా తమ కొత్త బౌలింగ్ కోచ్ పేరును కేకేఆర్ ప్రకటించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీని బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు తెలిపింది. కాగా ఇంతకు ముందు భరత్ అరుణ్ కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా ఉండగా.. అతడు లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరేందుకు కోల్‌కతా ఫ్రాంఛైజీని వీడాడు. ఈ క్రమంలో సౌతీతో అరుణ్ భరత్ స్థానాన్ని కేకేఆర్ భర్తీ చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇక సౌతీ 2021, 2023 సీజన్లలో ఆటగాడిగా కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. చంద్రకాంత్ పండిట్ మార్గదర్శనంలో 2023లో టైటిల్ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. కాగా.. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు సౌతీ ఆడాడు.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున 2008- 2024 వరకు ఆడిన సౌతీ.. 107 టెస్టులు, 161 వన్డేలు, 126 టీ20లలో కలిపి 776 వికెట్లు కూల్చాడు. తద్వారా కివీస్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 54 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. 47 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడు కావడం పట్ల 36 ఏళ్ల సౌతీ స్పందిస్తూ.. ‘‘కేకేఆర్ నా సొంత జట్టు లాంటిది. కొత్త పాత్రలో జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. 2026లో జట్టు విజయం సాధించేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని హర్షం వ్యక్తం చేశాడు.


