ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటిన వాషింగ్టన్‌ సుందర్‌ | WASHINGTON SUNDAR MAGIC IN COUNTY, 3 WICKETS WITH BALL AND 56 RUNS WITH BAT | Sakshi
Sakshi News home page

ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటిన వాషింగ్టన్‌ సుందర్‌

Sep 25 2025 8:06 PM | Updated on Sep 25 2025 8:38 PM

WASHINGTON SUNDAR MAGIC IN COUNTY, 3 WICKETS WITH BALL AND 56 RUNS WITH BAT

వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు (India vs West Indies) టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washinton Sunder) అదరగొట్టాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో (County Championship) బంతితో, బ్యాట్‌తో సత్తా చాటాడు. ప్రస్తుత​ కౌంటీ సీజన్‌లో హ్యాంప్‌షైర్‌కు ఆడుతున్న సుందర్‌.. సర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి, ఆతర్వాత బ్యాటింగ్‌లో అర్ద సెంచరీతో రాణించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్రే.. సుందర్‌ (3.2-0-5-3), కైల్‌ అబాట్‌ (12-4-27=3), జేమ్స్‌ ఫుల్లర్‌ (10-2-46-3), లియామ్‌ డాసన్‌ (12-5-26-1) ధాటికి 147 పరుగులకే ఆలౌటైంది. సర్రే ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 36 పరుగులు చేసిన డాన్‌ లారెన్స్‌ టాప్‌ స్కోరర్‌గా కాగా.. కెప్టెన్‌ రోరి బర్న్స్‌ (29) ఒక్కడే 20కి పైగా స్కోర్‌ చేశాడు.

అనంతరం బరిలో​కి దిగిన హ్యాంప్‌షైర్‌.. వాషింగ్టన్‌ సుందర్‌ (110 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులు చేసింది. హ్యాంప్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో సుందర్‌ మినహా ఎవరూ హాఫ్‌ సెంచరీ చేయలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సుందర్‌.. బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించి, చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.

101 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సర్రే.. రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. డొమినిక్‌ సిబ్లే (25), బెన్‌ ఫోక్స్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు. హ్యాంప్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు సర్రే ఇంకా 40 పరుగులు వెనుకపడి ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో సుందర్‌ ఇంకా బౌలింగ్‌కు దిగలేదు.

విండీస్‌తో సిరీస్‌కు ముందు సుందర్‌ మంచి టచ్‌లో ఉండటం​ టీమిండియాకు కలిసొచ్చే అంశం. సుందర్‌ ఇటీవల ముగిసిన ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ సత్తా చాటాడు. 4 టెస్ట్‌ల్లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ సహా 7 వికెట్లు తీశాడు. అక్టోబర్‌ 2 నుంచి విండీస్‌తో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో సుందర్‌ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

చదవండి: ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement