నో హ్యాండ్ షేక్.. ఈ వివాదం గతేడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆసియాకప్-2025 సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఫిర్యాదు చేయడం, పీసీబీ చీఫ్ మోహ్షిన్ నఖ్వీ చేతుల మీదగా భారత్ విన్నింగ్ ట్రోఫీని తీసుకోకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మరోసారి ఇప్పుడు అదే సీన్ రీపీట్ అయింది. కానీ ఈసారి ప్రత్యర్ధి మారింది.
ఏమి జరిగిందంటే?
అండర్-19 ప్రపంచకప్ 2026లో బులవాయో క్రికెట్ క్లబ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే టాస్ భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ ఒకరికొకరు కనీసం చూసుకోలేదు. టాస్ గెలిచి బౌలింగ్ బంగ్లా బౌలింగ్ ఎంచుకున్న తర్వాత ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేసుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపర్యమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి.
మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు భారత్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటామని వ్యాఖ్యానించడం తీవ్ర దూమారం రేపింది. అంతేకాకుండా బంగ్లాలో హిందువలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండంతో రెండు పొరుగు దేశాల మధ్య వైర్యం తీవ్రస్థాయికి చేరుకుంది.
అయితే ఈ రాజకీయ విభేదాల ప్రభావం క్రీడలపై కూడా పడింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా 2026లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనను కూడా బీసీసీఐ వాయిదా వేసింది.
దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపబోమని మొండి పట్టుతో ఉంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ పరిస్థితుల కారణంగానే ఇరు జట్ల కెప్టెన్లు కరాచలానికి నిరాకరించారు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు!


