రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-2026కు ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్‌కు సంబంధించిన అత్యుత్తమ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలను టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చోప్రా విశ్లేషించాడు.
పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్‌ను.. ఈ సీజన్‌లోనే అత్యుత్తమ నాక్‌గా ఆకాశ్ చోప్రా ఎంపిక చేశాడు. ఈ టోర్నీ లీగ్ దశలో భాగంగా అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్ కేవలం 67 బంతుల్లోనే 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వక్తిగత స్కోర్ సాధించిన భారత బ్యాటర్‌గా రాహుల్ రికార్డులెక్కాడు. అయితే ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఢిల్లీ ఓటమి చవిచూసింది. ఇక ప్లేఆఫ్స్‌లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్‌లు కూడా ఈ రేసులో ఉన్నాయని చోప్రా పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికి రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమని అతడు కొనియాడాడు.
లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మోహ్సిన్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ పై వేసిన స్పెల్‌ను చోప్రా ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనగా ఎంపిక చేశాడు. ఈ మ్యాచ్‌లో మోహ్సిన్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ మాదిరే మోహ్సిన్ కూడా ప్రదర్శన కూడా వృథా అయిపోయింది. కేకేఆర్‌పై లక్నో సూపర్ ఓవర్‌లో ఓటమి చవిచూసింది.
కాగా ఈ ఏడాది సీజన్‌లో బెస్ట్ ఓపెనర్‌గా రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. రాజస్తాన్ ఫైనల్‌కు చేరకపోయినప్పటికి, వైభవ్ మాత్రం దుమ్ములేపాడు. 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఉత్తమ మిడిలార్డర్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్, బెస్ట్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్‌లను అతడు ఎంచుకున్నాడు.
చదవండి: IND vs NZ: 12 మ్యాచ్‌లు.. 40 రోజులు! టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే


