న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2026 ఏడాదికిగాను తమ హోమ్ సీజన్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా కివీస్ జట్టు భారత్‌తో చారిత్రత్మక సిరీస్‌లో తలపడనుంది. భారత జట్టు ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్ పర్యటనకు రానుంది.
ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. కివీస్ గడ్డపై ఒకే పర్యటనలో ఇంత పెద్ద మొత్తంలో (12 మ్యాచ్‌లు) సిరీస్ నిర్వహించడం ఇదే మొదటిసారి. తొలుత టీ20 సిరీస్, ఆ తర్వాత వన్డే, టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
స్వదేశంలో వెస్టిండీస్‌తో వైట్ బాల్ సిరీస్‌లు ముగిసిన వెంటనే టీమిండియా న్యూజిలాండ్‌కు పయనం కానుంది. భారత జట్టు దాదాపు రెండు నెలల పాటు న్యూజిలాండ్‌లోనే గడపనుంది. 2027 వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ ఇరు జట్ల సన్నద్ధతకు ఈ 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ చాలా ముఖ్యం.
"భారత్‌తో సిరీస్ కంటే గొప్పది మరొకటి లేదు. న్యూజిలాండ్ క్రీడాభిమానులకు ముందెన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన టూర్‌ను అందించాలని మేము భావిస్తున్నాం. విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు ఇక్కడికి వస్తుండటంతో అభిమానుల సందడి, క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది.
న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే ఒకే టూర్‌లో స్వదేశంలో 12 మ్యాచ్‌లు నిర్వహించడం ఇదే తొలిసారి. భారత జట్టు రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. భారత్ ఆడే ప్రతీ మ్యాచ్ టిక్కెట్లు పూర్తిగా అమ్ముడవుతాయని మేము ఆశిస్తున్నామని" న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి గ్లెన్ క్రిచ్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా 2024లో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు.. టీమిండియాను టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గతేడాది వన్డే సిరీస్ కూడా కివీస్‌కు భారత్ సమర్పించుకుంది. ఈ పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంటూ.. కివీస్ గడ్డపైనే వారికి గట్టి బుద్ది చెప్పాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది.
మ్యాచ్‌ల పూర్తి వివరాలు, వేదికలు:
టీ20 సిరీస్ (అక్టోబర్ 22 - నవంబర్ 01)
అక్టోబర్ 22: మొదటి టి20 – క్రైస్ట్‌చర్చ్
అక్టోబర్ 24: రెండో టి20 – క్రైస్ట్‌చర్చ్
అక్టోబర్ 27: మూడో టి20 – వెల్లింగ్టన్
అక్టోబర్ 30: నాలుగో టి20 – ఆక్లాండ్
నవంబర్ 01: ఐదో టి20 – హామిల్టన్
వన్డే సిరీస్ (నవంబర్ 04 - నవంబర్ 15)
నవంబర్ 04: మొదటి వన్డే – ఆక్లాండ్
నవంబర్ 07: రెండో వన్డే – వెల్లింగ్టన్
నవంబర్ 10: మూడో వన్డే – హామిల్టన్
నవంబర్ 13: నాలుగో వన్డే – మౌంట్ మాంగనుయ్
నవంబర్ 15: ఐదో వన్డే – మౌంట్ మాంగనుయ్
టెస్ట్ సిరీస్ (నవంబర్ 19 - డిసెంబర్ 01)
నవంబర్ 19-23: మొదటి టెస్ట్ – వెల్లింగ్టన్
నవంబర్ 27-డిసెంబర్ 01: రెండో టెస్ట్ –క్రైస్ట్ చర్చ్


