మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL 2025) మెల్‌బోర్న్ స్టార్స్ ఓపెనర్, మహిళల ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన మెగ్ లాన్నింగ్ (Meg Lanning) చెలరేగిపోయింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. 74 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది.
WBBL HUNDRED FOR THE GOAT, MEG LANNING....!!!! 🐐 pic.twitter.com/0mc50pUij9
— Johns. (@CricCrazyJohns) November 20, 2025
ఆమెకు తోడు మరో ఓపెనర్ మెక్‌కెన్నా (34 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్టార్స్ ఇన్నింగ్స్‌లో లాన్నింగ్, మెక్‌కెన్నా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 12, మారిజన్ కాప్ 6 పరుగులు చేసి ఔట్ కాగా.. డానియెలా గిబ్సన్ 7, యామీ జోన్స్ 0 పరుగులతో అజేయంగా నిలిచారు.
సిక్సర్స్ బౌలర్లలో లారెన్ చీటిల్, ఆష్లే గార్డ్‌నర్, మ్యాడీ విలియర్స్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో స్టార్స్ చేసిన 219 పరుగుల స్కోర్ మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. ఈ లీగ్‌లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సిడ్నీ సిక్సర్స్ (242) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానంలో బ్రిస్బేన్ హీట్ (229) ఉంది.
ఈ మ్యాచ్‌లో లాన్నింగ్ చేసిన స్కోర్ (135) కూడా లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. మొదటి రెండు స్థానాల్లో లిజెల్ లీ (150 నాటౌట్), గ్రేస్ హ్యారిస్ (136 నాటౌట్) ఉన్నారు. ఈ సెంచరీతో లాన్నింగ్ WBBLలో అత్యధి ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ప్లేయర్ల జాబితాలో ఎల్లిస్ పెర్రీని (34) వెనక్కు నెట్టి రెండో స్థానానికి (35) ఎగబాకింది. టాప్ ప్లేస్‌లో బెత్ మూనీ (48) ఉంది. ఈ సెంచరీ లాన్నింగ్‌కు మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో రెండవది.
చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్


