● వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రముఖులు
సంగారెడ్డి : జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు పలు వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో రామ్ మందిర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తోటల కార్యక్రమం నిర్వహించారు. పూజల్లో మురళీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో అలరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. కార్యక్రమ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో సందడిగా మారింది. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకష్ణుడి జీవిత సందేశాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ధర్మం, సత్యం, మానవత్వం వంటి విలువలను ఆచరించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు.


