ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): క్రీడాకారులను తయారు చేయడంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ సుజాత తన మార్కును చూపిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేస్తూ, అలాగే ఆర్మీ, పోలీస్, తదితర ఉద్యోగాల్లో రాణించేలా శిక్షణనిస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వచ్చేలా ఆసక్తి కనబర్చే అంశంపై దృష్టి పెడుతున్నారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలిగేలా ప్రతి రోజు ఆటలు నేర్పిస్తూ, హాజరు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటుండ్రు. హాస్టల్‌లో ఉండి చదువుతున్న విద్యార్థులు ఇంటిపై బెంగ పెట్టుకోకుండా పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు కృషి చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు ఎక్కడ జరిగినా అక్కడికి విద్యార్థినులను తీసుకుని వెళ్తారు. సుజాత మేడం టీచర్ కాదు, మాకు అమ్మలాంటిదని విద్యార్థినులు చెప్పడం గమనార్హం.


