ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి: ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ఆ హామీల అమలులో పూటకో మాట చెబుతూ ప్రజల్ని మభ్య పెడుతోందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విమర్శించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నిరసన ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అడుగుపెడితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటేనే ముఖ్యమంత్రి, మంత్రులు నోట్లో నాలుక లేనట్టుగా.. సమాధానం కోసం తడబడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బిఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): 104 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా చెందిన 104 ఉద్యోగ సంఘం నాయకులు రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ..గత 18ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న 300మందిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. డీఎంఈ పరిధిలోని ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరిని నిబంధనల ప్రకారం జిల్లా డీఎస్‌సీ ద్వారా ఎంపీక చేసినప్పటికీ వారికీ నేటికీ ఔట్‌సోర్సింగ్ విధానంలోనే వేతనాలివ్వడం బాధాకరమన్నారు. ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వట్‌పల్లి(అందోల్): రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తులు విద్య, రాజకీయపరంగా ఎదగాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు, బాచుపల్లి మాజీ సర్పంచ్, విగ్రహ దాత ఆగం పాండు ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సపాన్ దేవ్ ఆకాంక్షించారు. అందోల్ మండల పరిధిలోని నాదులాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సామాజిక చైతన్య అధ్యక్షుడు బానిస నారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ముదిరాజ్ పితామహులు కొరివి కృష్ణస్వామి 133వ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో వారు మాట్లాడుతూ...ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి కుల బంధువులు ఉన్నతస్థాయిలోకి చేరుకోవాలని సూచించారు.
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం పాము ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రిలోని ప్రసూతి, చిన్నపిల్లల వార్డు సమీపంలోకి ఒక్కసారిగా పాము రావడాన్ని గమనించిన రోగులు, చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. వార్డులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, పామును చంపారు. రోగులు, పసిపిల్లలు ఉండే ముఖ్యమైన వార్డుల వద్దకే భారీ పాము రావడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


