చేతులెత్తేసినట్లేనా? | - | Sakshi
Sakshi News home page

చేతులెత్తేసినట్లేనా?

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

రాజకీయ రచ్చ..

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిషేధిత భూములు, నివాస స్థలాలు..22–ఏ దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా అధికార యంత్రాంగం చేతులెత్తేసిందా..? ఈ నిషేధిత భూముల జాబితాలోంచి తమ భూములను, తమ స్థలాలను తొలగించాలని వచ్చిన దరఖాస్తులను పక్కన బెట్టేసిందా..? జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) పరిష్కరించిన దరఖాస్తులు నామమాత్రమేనా..? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈ నిషేధిత జాబితాలోంచి తమ భూములను తొలగించాలని కోరుతూ ఇప్పటివరకు సుమారు 190 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పరిష్కారమైన దరఖాస్తులు పదిలోపే ఉన్నట్లు సమాచారం. మిగిలిన సుమారు 180కి పైగా దరఖాస్తులు తమ పరిధిలో లేదని..రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు పంపి ఇక్కడి అధికారులు చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది.

నివాస స్థలాలు, వెంచర్లు..

జిల్లాలో ఈ నిషేధిత జాబితాలో పెట్టిన భూముల్లో నివాస స్థలాలున్నాయి. ఇండ్లు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల అసైన్డ్‌ భూముల్లో చాలా ఏళ్ల క్రితమే ఇళ్లు, ఇతర భవనాలు నిర్మించుకున్నారు. చాలా ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. ప్రధానంగా సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గంలో వేలాది ఎకరాలు అసైన్డ్‌ భూములు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల భూములు, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు, నివాసాలు వెలిశాయి. వీటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో వీటిని విక్రయించడానికి వీల్లేకుండా పోయింది. తమ ఆర్థిక అవసరాల కోసం వీటిని విక్రయిద్దామంటే రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పొరపాటున నిషేధిత జాబితాలో పడిన భూములు, నివాస స్థలాలను 22ఏ నుంచి తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా సుమారు 200 వరకు దరఖాస్తులు వచ్చాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలిస్తోంది. ఇందులో చాలామట్టుకు తాము నిర్ణయం తీసుకోలేమని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది.

22 ఏ లోంచి తొలగించాలని 200 దరఖాస్తులు

వీటిల్లో పరిష్కారమైంది పది శాతం లోపే!

రాష్ట్రస్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదనలు

నిషేధిత అంశంపై కొనసాగుతున్న రాజకీయ రచ్చ

ఈ నిషేధిత జాబితా 22ఏ అంశం రాజకీయ రచ్చకు దారితీసింది. అమాయకుల ప్రైవేటు ఆస్తులను, పట్టాభూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఇటీవల పటాన్‌చెరులో బాధితులతో సమావేశం నిర్వహించిన ఆ పార్టీ ఈ దరఖాస్తులను పరిష్కరించని పక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు హెచ్చరించారు. మరోవైపు బీజేపీ కూడా ఈ 22ఏ జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్‌ పార్టీ మాత్రం బీఆర్‌ఎస్‌, బీజేపీల తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారని, అధికారులపై ఒత్తిడి చేసి అసైన్డ్‌ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తోంది. ఇలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ 22ఏ నిషేధిత భూములు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అధికారులు మాత్రం ఈ దరఖాస్తుల విషయంలో గోప్యత పాటించడం పలు ఆరోపణలను దారి తీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement