అందరితో పాటు చదువు
నారాయణఖేడ్: అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతతోపాటు దివ్యాంగ విద్యార్థుల గుర్తింపుపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ(ఎస్‌హెచ్‌వీఆర్) 2026– 27 రేటింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రశాంత్ కార్యక్రమం ద్వారా దివ్యాంగ పిల్లలను గుర్తించే ప్రక్రియలో ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ మేరకు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణను పెంపొందించే ఉద్దేశంతో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతీ పాఠశాల యూడైస్ కోడ్ ద్వారా అధికారిక పోర్టల్ లేదా మొబైల్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉన్నా అతి త్వరగా ఈ ప్రక్రియను ముగించాలని సూచించారు. పాఠశాలలు పాటించే ప్రమాణాల ఆధారంగా వారికి 1 నుంచి 5 స్టార్ వరకు రేటింగ్ ఇవ్వనున్నారు.
ప్రత్యేక అవసరాల గుర్తింపు
జిల్లాలో 1 నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ 1,919 పాఠశాలలుండగా అందులో 3,73,613 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులు 3,572 మందిగా ఇప్పటికే నమోదై ఉన్నారు. ప్రస్తుతం నిర్వహించనున్న నమోదు ప్రక్రియ ద్వారా దివ్యాంగ విద్యార్థుల సంఖ్య పెరగనుంది. పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రాథమిక దశలో గుర్తించి వారికి తగిన తోడ్పాటు అందించడమే ప్రశాంత్ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. సెప్టెంబర్ 30 నాటికి ఈ విద్యార్థుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇందులోభాగంగా ఉపాధ్యాయులందరూ ప్రశాంత్ పోర్టల్ లేదా యాప్‌లో లాగిన్ అయి అందులో సూచించిన శిక్షణ వీడియోలను తప్పనిసరిగా వీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు పిల్లల్లోని అంగవైకల్య లక్షణాలు నిశితంగా గమనించి వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా విద్యాశాాఖ అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో మెరుగైన అభ్యసన వాతావరణాన్ని కల్పించడంతోపాటు దివ్యాగ విద్యార్థులకు సముచిత న్యాయం చేయడమే ఈ రెండింటి లక్ష్యంగా పేర్కొన్నారు.
పాఠశాలలకు స్వచ్ఛ ఏవం రేటింగ్
నెలాఖరు వరకు నమోదుకు మార్గదర్శకాలు
దివ్యాంగులకూ అందరితోపాటు చదువు
ప్రత్యేక అవసరాలు, దివ్యాంగ విద్యార్థులను గుర్తించి అందరు విద్యార్థులతో సమానంగా చదువుకొనేలా వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. మరీ వైకల్యం అధికంగా ఉన్న విద్యార్థులు గుర్తించి భవిత కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ చదువుతోపాటు వారంలో రెండు రోజులపాటు ఫిజియోథెరపీ సేవలు అందిస్తారు.


