సంగారెడ్డి జోన్/కంది (సంగారెడ్డి)/వట్‌పల్లి(అందోల్)/సంగారెడ్డి జోన్: సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి చేపట్టింది. మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణిలో 85 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు అధికారులు హాజరై ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ సమస్యలే అధికంగా ఉన్నాయి.
పలు శాఖల అధికారులు గైర్హాజరు
ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ పలు మండలాల్లో మండలస్థాయి అధికారులు గైర్హాజరయ్యారు. మరి కొంతమంది కిందిస్థాయి సిబ్బందిని పంపించి చేతులు దులుపుకున్నారు. మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం పట్ల ఇతర శాఖ అధికారులతో పాటు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదు
ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి రశీదులను అందించారు. దీంతో ఫిర్యాదుల అప్‌డేట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎంపీడీఓ అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరించారు.
మండలస్థాయి ప్రజావాణి ప్రారంభం
25 మండల కేంద్రాల్లో 85 దరఖాస్తులు
పలు చోట్ల అధికారులు గైర్హాజరు
ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదు
డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి
ఏడేళ్లుగా తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని చర్లగూడెంకు చెందిన వారసు లక్ష్మి కంది ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. 2019లో తన భర్త వారసు గంగయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినా పంచాయతీ అధికారులు సర్టిఫికెట్ ఇవ్వడం లేదన్నారు. తన భర్త డెత్ సర్టిఫికెట్ లేకపోవడంతో తాను పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నానని, అధికారులు తనకు సర్టిఫికెట్ ఇప్పించాలని కోరింది. ఫిర్యాదుల స్వీకరణలో తహసీల్దార్ హసీనా వేగం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏ ఈ రవికుమార్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనాథ్‌రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


