కొండాపూర్(సంగారెడ్డి): సర్పంచ్‌ల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా కొండాపూర్ మండలం శివ్వన్న గూడెం సర్పంచ్ వినోద్ రాథోడ్ నియామకమాయ్యరు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో వినోధ్ రాథోడ్‌కు మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ...కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సరైన సమయంలో బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరమయ్యే వరకు ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరముందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్య, సర్పంచ్‌లు శ్రీనివాస్ గౌడ్, మహేశ్, కృష్ణ, రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల యూనిఫాం కోసం ప్రభుత్వం అందజేసిన వస్త్రాన్ని అధికారులు నిర్లక్ష్యంగా పడేశారు. ఈ ఘటన హత్నూర ఐకేపీ కార్యాలయంలో సోమవారం ‘సాక్షి’కెమెరాకు చిక్కింది. యూనిఫాం కుట్టించేందుకు మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వాల్సిన వస్త్రాన్ని కార్యాలయంలోనే మూలుగుతున్నాయి. కార్యాలయానికి యూనిఫాం వస్త్రం రాగానే వాటిని కుట్టేందుకు వెంటనే ఇవ్వాలి కానీ ఇక్కడ మాత్రం రోజుల తరబడి మూలన పడేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు యూనిఫాం త్వరగా కుట్టించేవిధంగా కార్యాలయం నుంచి వస్త్రాన్ని దుస్తులు కుట్టే మహిళలకు పంపిణీ చేయాల్సిందిగా పలువురు కోరారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి
చిలప్‌చెడ్(నర్సాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదిముబాకర్ పథకాన్ని నిలిపివేయడం సరికాదని ఎమ్మెల్యే సునీతారెడ్డి రేవంత్ సర్కారు తీరును విమర్శించారు. సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆమె చిలప్‌చెడ్ తహసీల్ ఆవరణలో కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఆడ పిల్లలను కన్న పేద తల్లిదండ్రుల బాధను చూడలేక, ప్రతీ ఆడపిల్ల చదుకోవాలని, 18 ఏళ్ల వయసు నిండేవరకు పెళ్లి చేసుకోకూడదనే మంచి సంకల్పంతో, కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కల్యాణలక్ష్మిని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పాస్‌పోర్టు సేవా కేంద్రంగా సంగారెడ్డి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని హెడ్ పోస్టాఫీస్‌ను పాస్ పోర్టు సేవా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...సంగారెడ్డిలో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేయాలని కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందేనన్నారు. కేంద్రమంత్రి చంద్రశేఖర్ తక్షణమే స్పందించి పాస్‌పోర్టు కేంద్రానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు ప్రతిపాదనలను పంపించడం జరిగినట్లు కేంద్ర మంత్రి కార్యాలయం ప్రకటించినట్లు ఎంపీ తెలిపారు.


