ఏకాభిప్రాయం కుదిరేనా! | - | Sakshi
Sakshi News home page

ఏకాభిప్రాయం కుదిరేనా!

Aug 18 2026 7:58 AM | Updated on Aug 18 2026 7:58 AM

డీసీసీ అధ్యక్ష పదవి నియామక ప్రక్రియను ఆ పార్టీ అధినాయకత్వం మరోసారి ప్రారంభించింది. గతేడాది అక్టోబర్‌లో చేపట్టిన ముఖ్యనేతల అభిప్రాయసేకరణలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అప్పట్లో నియామకాన్ని వాయిదా వేసింది. అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించినప్పటికీ..నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక సంగారెడ్డితోపాటు,రంగారెడ్డి, రామగుండం సిటీ డీసీసీ అధ్యక్ష పదవుల నియామకం పెండింగ్‌లో పడిన విషయం విదితమే. పదినెలల తర్వాత ఇప్పుడు రెండోసారి నియామక ప్రక్రియను షూరూ చేసింది.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

ఏఐసీసీ పరిశీలకుడు దీపక్‌ రాథోడ్‌, టీపీసీసీ కోఆర్డినేటర్లు దుద్దిళ్ల శ్రీనివాస్‌బాబు, రియాజ్‌, నేరెళ్లశారద జిల్లా ముఖ్యనేతల అభిప్రాయాలను సోమవారం సేకరించారు. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు గిరిధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కాటా శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్‌ బాధ్యులతో వన్‌ టూ వన్‌ మాట్లాడిన దీపక్‌రాథోడ్‌ డీసీసీ పదవిని ఎవరికి ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది..? అనే అంశంపై ప్రాథమిక అభిప్రాయ సేకరణ చేపట్టారు.

మొదటి నుంచి ఎంపిక ప్రక్రియ

పది నెలల క్రితం ఈ డీసీసీ పదవి కోసం దరఖాస్తులు స్వీకరించిన అధినాయకత్వం..మళ్లీ ఇప్పుడు ఆశావహులు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు దీపక్‌రాథోడ్‌ నుంచి ప్రత్యేకంగా దరఖాస్తు ఫారాలను అందజేశారు. అలాగే జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ పరిశీలకులు తెలిపారు. ఈ నియోజకవర్గ సమావేశాల్లో మండల ప్రెసిడెంట్లు ఆ పై స్థాయి నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. సుమారు పది నుంచి 12 ఆశావహుల పేర్లతో షార్ట్‌ లిస్టును ఏఐసీసీకి పంపుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 6 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు.

ఎవరికి వారే!

గతేడాది అక్టోబర్‌లో మొదటిసారి నిర్వహించిన డీసీసీ నియామక ప్రక్రియ కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాలకు అద్దం పట్టింది. ఈ పదవి కోసం ఏ జిల్లాలో లేనివిధంగా ఏకంగా 30 మంది నాయకులు దరఖాస్తు చేసుకోవడం.. మాకే ఈ పదవులు ఇవ్వాలని అధినాయకత్వం వద్ద గట్టిగా తమ వాదనను వినిపించారు. మంత్రి దామోదర రాజనర్సింహ వంటి ముఖ్య నేతలు ఈ డీసీసీ పదవిని ఉజ్వల్‌రెడ్డికి ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఖేడ్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే ఐదు నియోజకవర్గాల్లో ముఖ్యనేతల మద్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నియామకం వాయిదా పడింది. కాగా ఇప్పుడు ఈ డీసీసీ నియామక ప్రక్రియ చేపట్టడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా మంత్రి దామోదర తదితర ముఖ్యనాయకులతోపాటు, సీఎం రేవంత్‌రెడ్డి, టీసీపీపీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆశీస్సులు తమకే ఉన్నాయని, తమకే ఈ డీసీసీ పోస్టు వరిస్తుందని ధీమాతో ఓ నేత ఉండగా, విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్నానని తనకే ఈ పదవి దక్కుతుందని మరొకరు పేర్కొంటున్నారు. పార్టీ ఆదేశించిన ప్రతీ కార్యాక్రమాన్ని తూచ తప్పకుండా నిర్వహిస్తున్న తనే ఈ డీసీసీ పదవికి అర్హుడినని మరో నాయకుడు వాదిస్తున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ పదవి తనకే ఇవ్వాలని మరో నాయకుడు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే ఈ పదవి కోసం పట్టు వీడకపోవడంతో కాంగ్రెస్‌ మార్కు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఎట్టకేలకు మరోసారి

డీసీసీ నియామక ప్రక్రియ

నేతల అభిప్రాయం సేకరించిన

ఏఐసీసీ పరిశీలకుడు దీపక్‌

ఆశావహుల నుంచి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ

త్వరలో ఐదు నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాలు

ఆసక్తికరంగా

కాంగ్రెస్‌ సంస్థాగత రాజకీయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement