సంగారెడ్డి జోన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) రూపకల్పనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2,98,278 మంది ఓట్లు జాబితా నుంచి అధికారులు తొలగించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల పరిధిలో సర్ ప్రక్రియ చేపట్టకముందు 14,57,436 మంది ఓటర్లు ఉన్నారు. అనంతరం సర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ చేసి 11,59,158 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రక్రియలో 2,98,278 మంది ఓటర్లను వివిధ కారణాలతో జాబితా నుంచి తొలగించారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారు, ఇతర ప్రాంతాల వారందరినీ గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం గ్రామ పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ వివరాలను విడుదల చేశారు. సంబంధిత పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాబితాలను ప్రదర్శించారు.
3,47,688 మందికి నోటీసులు
సర్ ప్రక్రియ అనంతరం జిల్లాలో 3,47,688 మంది ఓటర్లకు నోటీసులు అందించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారు సరైన ఆధారాలు చూపించి, ఓటరుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జాబితాలో పేరు లేని వారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముసాయిదా ఓటరు జాబితాపై సెప్టెంబర్ 16 వరకు తమ అభ్యంతరాలను ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. వచ్చిన ఫిర్యాదులు అక్టోబర్ 15 వరకు పరిష్కరించనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటించేందుకు రూపకల్పన చేశారు.
పెరిగిన పోలింగ్ స్టేషన్ల సంఖ్య
సర్ ప్రక్రియ అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్ల సంఖ్య తగ్గిపోగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. 2,98,278 మంది ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రక్రియకు ముందు 1,633 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుత ముసాయిదా జాబితా ప్రకారం1, 649 కేంద్రాలు ఉన్నాయి.
తమ పేర్లను పరిశీలించుకోవాలి: కలెక్టర్
పంచాయతీల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ప్రతీ ఒక్కరు తమ పేర్లను పరిశీలించుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ముసాయిదా జాబితా ఓటరు విడుదల అనంతరం ప్రముఖ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఓటర్లు 11,59,158
పెరిగిన పోలింగ్ కేంద్రాలు
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
సెప్టెంబర్ 16 వరకు
అభ్యంతరాల స్వీకరణ


