ఇంకెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

ఇంకెప్పుడో?

Aug 10 2026 7:20 AM | Updated on Aug 10 2026 7:20 AM

కో–ఆప్షన్‌
ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం

జహీరాబాద్‌: మున్సిపల్‌ పాలక మండలి ఏర్పడి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఎన్నిక నిర్వహణ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. నియోజకవర్గంలోని జహీరాబాద్‌, కోహీర్‌ మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్‌ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చినా తగినంత కోరమ్‌ లేక సమావేశాలు వాయిదా పడ్డాయి. తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో ఆశావాహుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జహీరాబాద్‌ మున్సిపాలిటీ కో–ఆప్షన్‌ ఎన్నిక నిర్వహణ కోసం ఏప్రిల్‌ 4న సమావేశం నిర్వహించారు. సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో కోరమ్‌ లేక సమావేశం వాయిదా పడింది. తిరిగి మే 23న ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ యూనూస్‌ ప్రకటించారు. అయినా పలు కారణాల చేత వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఇప్పటివరకు ఎన్నిక నిర్వహణకు తేదీ ఖరారు చేయలేదు. కోహీర్‌ మున్సిపాలిటీలో కో–ఆప్షన్‌ ఎన్నిక నిర్వహణ కోసం మే 5న సమావేశం నిర్వహించారు. సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. దీంతో కోరమ్‌ లేక వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటించలేదు.

భారీగా దరఖాస్తులు

కో–ఆప్షన్‌ పదవుల కోసం ఆయా మున్సిపాలిటీల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. జహీరాబాద్‌ మున్సిపాలిటీలో 36 మంది దరఖాస్తులు చేసుకోగా, కోహీర్‌ మున్సిపాలిటీలో 22 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌తోపాటు మజ్లిస్‌ సభ్యులు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. జహీరాబాద్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురి వంతున ఎక్స్‌అఫీషియో సభ్యులను ఎన్నుకునే వీలుంది.

కాంగ్రెస్‌కు స్వల్ప మెజార్టీయే

జహీరాబాద్‌ మున్సిపాలిటీలో 37 మంది కౌన్సిలర్లు ఉండగా, 15 స్థానాలను బీఆర్‌ఎస్‌, 14 స్థానాలను కాంగ్రెస్‌, 3 స్థానాల్లో బీజేపీ, రెండుస్థానాల్లో మజ్లిస్‌, రెండుస్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉండగా, కాంగ్రెస్‌కు ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. దీంతో మున్సిపాలిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 39 ఉంది. బీఆర్‌ఎస్‌కు ముగ్గురు సభ్యులున్న బీజేపీ, ఒక ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా కలుపుకుని 19 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి ఇద్దరు మజ్లిస్‌, ముగ్గురు స్వతంత్రులు, ఒక ఎక్స్‌అఫీషియో సభ్యుడితో కలుపుకుని 20మంది సభ్యులు బలం ఉంది. ఎలాగైనా కాంగ్రెస్‌ పదవులను దక్కించుకుంటుందనే ఆశతో పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్‌ సైతం పదవులపై ఆశలు పెట్టుకుని కాంగ్రెస్‌ మద్దతుదారుల్లో ఒకరిని తమ వైపు తిప్పుకుంటే నాలుగు కో–ఆప్షన్‌ పదవులు దక్కించుకోవచ్చనే ఆశతో పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న అసంతృప్తిని సొమ్ముచేసుకోవాలనే భావిస్తోంది. ఇదిలాఉంటే కోహీర్‌ మున్సిపాలిటీలో 16 మంది సభ్యులకు గాను 8 పదవులను కాంగ్రెస్‌ దక్కించుకుంది. బీఆర్‌ఎస్‌ 5 పదవులను దక్కించుకుంది. అక్కడ ఒక ఎంఐఎం, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌లతో కాంగ్రెస్‌ చైర్మన్‌ పదవి దక్కించుకుంది. నాలుగు కో–ఆప్షన్‌ పదవులు కాంగ్రెస్‌ కూటమికే దక్కనున్నాయి.

జహీరాబాద్‌, కోహీర్‌ మున్సిపాలిటీల్లో కొలిక్కి రాని అభ్యర్థుల ఎంపిక

ఆయా మున్సిపాలిటీల్లో ఆశావాహుల్లో తీవ్ర పోటీ

కో ఆప్షన్‌ పదవులకు పోటీ

కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు అవకాశం దక్కనివారు, అనుకూలంగా రిజర్వేషన్‌ రాకపోవడంతో పోటీ చేసే భాగ్యం కలగని వారు కో–ఆప్షన్‌ పదవిపై కన్నేశారు. అల్ప సంఖ్యాకులతోపాటు మాజీ కౌన్సిలర్లకు అవకాశం ఉండటంతో ఆయా మున్సిపాలిటీల్లో అశావాహుల సంఖ్య అధికంగా ఉంది. జహీరాబాద్‌లో 36 మంది, కోహీర్‌లో 22 మంది కో–ఆప్షన్‌ పదవుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన వారే అధికంగా కో–ఆప్షన్‌ పదవులను ఆశిస్తున్నారు. జహీరాబాద్‌, కోహీర్‌ మున్సిపాలిటీల్లో ఎంఐఎం ఒక్కో స్థానాన్ని ఆశిస్తోంది. అయితే తీవ్ర పోటీ నెలకొన్న కారణంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసే విషయంలో కాంగ్రెస్‌ నేతలు బాధ్యత తీసుకునే విషయంలో అనాసక్తి చూపుతున్నారు. ఇదే జాప్యానికి కారణంగా చెబుతున్నారు. మహిళా స్థానాల కంటే జనరల్‌ స్థానాలపైనే అధిక పోటీ నెలకొంది.

తార్‌మార్‌ టక్కర్‌ మార్‌

జహీరాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు ఒక ఓటు మాత్రమే అధికంగా ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా తార్‌మార్‌ టక్కర్‌ మార్‌ అనే పరిస్థితి ఎదురవుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఉండటంతో అభ్యర్థుల ఎంపిక అంత ఈజీగా లేదనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ కాచుకు కూర్చొంది. ఎక్కడ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తోంది. కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతిని తమ విజయానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్‌ మాత్రం ఎన్నికల నిర్వహణకు సానుకూలంగా లేనందునే ఎన్నిక వాయిదా వేస్తూ వస్తోందనే విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement