ప్రజాకాంక్ష నెరవేర్చేలా పాలన | - | Sakshi
Sakshi News home page

ప్రజాకాంక్ష నెరవేర్చేలా పాలన

Aug 17 2026 7:23 AM | Updated on Aug 17 2026 7:23 AM

సంగారెడ్డి జోన్‌: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌తో కలిసి పాల్గొన్నారు. పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతం ఆలపించారు. అదేవిధంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

రైతుకు భరోసాకు రూ.418 కోట్లు

రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం సీజన్‌లో 3,60,464 మంది రైతులకు రూ.418 కోట్లు జమ చేశామని మంత్రి దామోదర వివరించారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే...‘‘రబీ సీజన్లో 33,540 రైతుల నుండి 1,70,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి రూ. 405.73 కోట్లు చెల్లించాం. సన్నఒడ్లకు బోనస్‌ రూపంలో రూ.2.76 కోట్లు ఇవ్వనున్నాం. 2025–26లో రైతు బీమా పథకం ద్వారా 1,180 మంది రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున రూ.59 కోట్లను నామిని ఖాతాలో జమ చేశాం.

ప్రజా ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట

ప్రజా ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జిల్లాలో రూ.275 కోట్లతో కొత్త 500 పడకల ప్రభుత్వాస్పత్రి పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.168 కోట్ల నిధులతో మెడికల్‌ కళాశాలతోపాటు హాస్టల్‌ భవనాలను నిర్మించి ప్రారంభించాం. రూ.34 కోట్ల నిధులతో నిర్మించిన నర్సింగ్‌ కళాశాల ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

రహదారుల మరమ్మతులకు నిధులు

జిల్లాలో హ్యమ్‌ పద్ధతిలో 318 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం రూ.685 కోట్లు మంజూరు కాగా, రూ.405 కోట్ల నిధులతో 188 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి’’అని మంత్రి వివరించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మంత్రి దామోదర రాజనర్సింహ

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర వేడుకలు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement