సంగారెడ్డి : లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంగారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో వచ్చి కంది ఐఐటీలో దిగారు. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా 3:20 నిమిషాలకు ఐబీ వద్దకు చేరుకుని నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు.
ప్రచార రథంలో సభాస్థలికి
అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి వెళ్లేందుకు జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ప్రచార రథం ఐబీలో నుంచి సీఎం వద్దకు తేవాలని తన అనుచరులకు చెప్తున్న క్రమంలోని రోడ్డు మొత్తం సీఎం కాన్వాయ్, పైలెట్ల వాహనాలతో జామ్ అయిపోయింది. ఈ క్రమంలో ప్రచార రథంలో సీఎం వెళ్లడం వద్దని పైలెట్లు కోరగా జగ్గారెడ్డి రథం వద్దని చెప్పారు. కాన్వాయ్‌లో వెళ్లాలా? ప్రచార రథంలో వెళ్ళాలా అని కొద్దిసేపు తటపటాయించిన సీఎం చివరికి ప్రచారరథంలోనే సభాస్థలికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి వెంబడి ప్రజలకు అభివాదం చేసుకుంటూ 3:25 నిమిషాలకు అంబేడ్కర్ స్టేడియంకు చేరుకున్నారు. దాదాపు గంటసేపు మంత్రులు ప్రసంగించిన అనంతరం సరిగా 4:21 నిమిషాలకు సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగం ప్రారంభించి 40 నిమిషాలు మాట్లాడారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి సీఎం రేవంత్‌ను శాలువాతో సత్కరించారు. సభావేదికపై నుంచి కిందికి వచ్చే క్రమంలో నాయకులు, ఉద్యోగ సంఘాలు, లబ్ధిదారులు వినతిపత్రాలు సీఎంకు సమర్పించారు. 5:30 తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
రోజంతా కండువాలతో
సంగారెడ్డి జనసంద్రం
సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా సంగారెడ్డిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, ప్రజలతో కిక్కిరిసింది. పంద్రాగస్టు వేడుకలు ముగిశాక 10 గంటలకు నుంచి గంటల 7 గంటల వరకు ఎటుచూసినా కాంగ్రెస్ శ్రేణులే కన్పించాయి.


