ఝరాసంగం(జహీరాబాద్): మొగలివనంలో వెలసిన కేతకి సంగమేశ్వర ఆలయంలో శుక్రవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో అమెరికా కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. 52 నోట్ల డాలర్లు రాగా వాటి విలువ సుమారు రూ.5వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. వీటితోపాటు చిరిగిన నోట్లు, రద్దు చేసిన నోట్లు కనిపించాయి. అమెరికా నోట్లు కనిపించడంతో అమెరికా భక్తులు దర్శించుకున్నారా? లేదా మన దేశపు భక్తులే సమర్పించారా? అని చర్చించుకుంటున్నారు.
ఈ నెల 10 వరకు అవకాశం
వర్గల్(గజ్వేల్): పీఎంశ్రీ వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు స్వీకరణ గడువు మరో మూడు రోజులు పొడిగించారు. ఏడో తేదీకి గడువు ముగియగా విద్యార్థుల ప్రయోజనం కోసం దీనిని ఈ నెల 10 వరకు పొడిగిస్తూ విద్యాలయ సమితి ఆదేశాలు జారీ చేసిందని ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతూ, తల్లిదండ్రులు ఉమ్మడి జిల్లా నివాసులై ఉండాలి. హెచ్‌ఎం ధ్రువీకరణ పత్రం, ఫొటోతో ఆన్‌లైన్‌లో గడువు తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు.
మెదక్‌జోన్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరికి న్యాయస్థానం జరిమానా విధించింది. వివరాలు ఇలా.. మెదక్ పట్టణంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరు పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి మొబైల్ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.
డీఐఈఓ రవీందర్‌రెడ్డి
సిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రెండు రోజులుగా అధ్యాపకులకు నిర్వహిస్తున్న మొదటి విడుత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా డీఐఈఓ రవీందర్‌రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు వివరించాలన్నారు. ప్రభావవంతమైన బోధనను చేసి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ విజయలక్ష్మి, దుబ్బాక ప్రిన్సిపాల్ చంద్రయ్య, డీఆర్‌పీలు అమరేందర్‌రెడ్డి,రాణి, దేవయ్య, శ్రీదేవి, సైదులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మెదక్‌రూరల్ సీఐ కృష్ణమూర్తి కేసు వివరాలు వెల్లడించారు. పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన మధు కొంత కాలంగా హవేళిఘణాపూర్ మండలం ఫరీద్‌పూర్, మెదక్ మండలం పాతూర్ గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో మండలంలోని మంభోజిపల్లి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న మధును పట్టుకొని విచారించగా చోరీలకు పాల్పడినట్లు నేరం అంగీకరించాడు. అతని వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. గతంలో ఇతనిపై పలు చోరీ కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో మెదక్‌రూరల్ ఎస్‌ఐ రాజు, పోలీసు సిబ్బంది నాగరాజు ఉన్నారు.
బైక్ చోరీ నిందితుడు..
సిద్దిపేటఅర్బన్: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా.. సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు శుక్రవారం పెట్రోలింగ్ చేస్తుండగా పొన్నాల రాజీవ్ రహదారిపై ఓ వ్యక్తి బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకోగా మద్యం తాగి వాహనం నడుపుతున్నట్టు గుర్తించారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా బీఏసీ రీడింగ్ 332 నమోదైంది. బైక్‌ను పరిశీలించగా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు లేకపోవడంతో విచారించారు. రెండు రోజుల క్రితం సిద్దిపేటలోని కోటిలింగాల గుడి ప్రాంతంలో దొంగిలించినట్టు అంగీకరించాడు. ఫింగర్‌ప్రింట్ డివైస్ ద్వారా పరిశీలించగా సిద్దిపేట పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు దేవరాజుగా గుర్తించారు. నిందితుడిపై ఐదు చోరీ కేసులు నమోదైనట్టు గుర్తించారు. బైక్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.


