తూప్రాన్: పొలానికి వెళ్లిన రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన మండలంలోని నర్సంపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జింక నాగార్జున(26) రోజూ మాదిరిగా గురువారం ఉదయం పొలం వద్ద కట్టేసిన గేదెలకు పాలు పితకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ తెగి పడిన విద్యుత్ తీగ కనిపించింది. కరెంట్ సరఫరా లేదని భావించి ఆ తీగను పక్కకు తొలగించడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప పొలంలో ఉన్న ఓ రైతు గమనించి నాగార్జున కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి జింక శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ ఇద్దరు..
పెద్దశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో మండలంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి. పెద్దశంకరంపేట శివారులోని గురుపాదగుట్ట వద్ద ఆదివారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పేటకు చెందిన ఆర్‌ఎంపీ తోట రవీందర్, మల్కాపూర్ గ్రామానికి చెందిన మునావత్ జైపాల్ హైదరాబాద్‌లో చికిత్స పొందు తూ మృతి చెందారు. తోట రవీందర్ బుధవారం రాత్రి బ్రెయిన్‌డెడ్ కాగా, జైపాల్ గురువారం గాంధీ ఆస్పతిల్రో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఒక ప్రమాదం రెండు కుటుంబాలలో తీవ్రవిషాదాన్ని నింపింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆర్‌ఎంపీ తోట రవీందర్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వాహనం ఢీకొని...
సదాశివపేటరూరల్(సంగారెడ్డి): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఆరూర్ గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరూర్ శివారులోని గోల్డెన్ దాబా సమీపంలోని పబ్లిక్ టాయిలెట్స్ ఎదురుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డును దాటుతున్నాడు. ఇదే క్రమంలో సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని, నలుపు రంగు టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసినవారు 87126 61833, 87126 56721 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.
జైపాల్(ఫైల్)
రవీందర్(ఫైల్)


