మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని మల్లుపల్లిలో గ్రామ కంఠం భూవివాదం రాజుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన తిప్పరమైన సాయికుమార్ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎంపీఓ ఫహీం ఆధ్వర్యంలో బుధవారం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. గతంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు తనకున్న మూడు గుంటల భూమిలో రెండు గుంటల భూమిని స్వచ్ఛందంగా అప్పజెప్పినప్పటికీ, ప్రస్తుతం ఒక గుంట భూమిలో పశువుల పాకను ఏర్పాటు చేసుకున్నానని ఫిర్యాదుదారుడు సాయికుమార్ అధికారుల ముందు వాపోయాడు. ఎన్నికల సమయంలో సహకరించలేదన్న కారణంతో సర్పంచ్ కనకరాజు మిగిలిన తన భూమిని కూడా తీసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన స్థలాన్నే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని వాపోయాడు. అయితే గ్రామ అభివృద్ధి కోసమే గ్రామస్తుల సహకారంతోనే స్థలాన్ని సేకరిస్తున్నామని, ఇందులో ఎలాంటి కక్షపూరిత వ్యవహారాలు లేవని సర్పంచ్ కనకరాజు స్పష్టం చేశారు. అనంతరం ఎంపీఓ పహీం మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారులకు పూర్తి సమాచారాన్ని నివేదించి త్వరలో భూ సమస్యకు పరిష్కారం చూపుతామని తెలపడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం సద్దుమణిగింది.
రెండు వర్గాల మధ్య వాగ్వాదం


