రామచంద్రాపురం(పటాన్‌చెరు): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లేబర్ క్యాంపులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన జయదేబ్ బిస్వాస్, ప్రశంజిత్ కలిసి వారి రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకొచ్చి కొల్లూరు లేబర్ క్యాంపులో విక్రయించేందుకు ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
వర్గల్(గజ్వేల్): వివాహితపై లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు గౌరారం పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు కథనం ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలుడు సోమవారం పక్కింట్లో ఉండే వివాహితపై లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
నర్సాపూర్ రూరల్: హత్యాయత్నం కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం.. శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన పందిముక్కుల నర్సింలు గౌడ్‌పై అదే గ్రామానికి చెందిన దాయాదులు పందిముక్కుల గోపాల్ గౌడ్, పందిముక్కుల మనీశ్‌గౌడ్ కలిసి చాకరిమెట్ల హనుమాన్ ఆలయ సమీపంలో బైక్‌ను అడ్డగించి దాడి, హత్య చేసేందుకు ప్రయత్నించారు. కాగా వీరి మధ్య పూర్వీకుల నుంచి వచ్చిన భూమి విషయంలో కొన్ని రోజులుగా కోర్టులో కేసు నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈనెల 28న నర్సాపూర్ కోర్టులో విచారణకు హాజరై వస్తున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం నర్సింలు గౌడ్‌ని ఇద్దరు హత్య చేసేందుకు ప్రయత్నించారు.
టేక్మాల్(మెదక్): విద్యార్థి అదృశ్యమైన ఘటన మండలంలోని కోరంపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ అరవింద్‌కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తంగెడపల్లి నరేశ్(17) గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈనెల 24న ఇంటికి వచ్చిన అతడు 28న హాస్టల్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు. కానీ హాస్టల్‌కు వెళ్లలేదు. దీంతో కుటుంబీకులు బంధువుల వద్ద, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రానికి 550 బస్తాల యూరియా వచ్చిందని, గురువారం ఉదయం 6 గంటల నుంచి యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. అయితే యాప్ బుధవారం రాత్రే ఓపెన్ కావడంతో తెలిసిన రైతులు యూరియా బుక్ చేసుకున్నారు. ఉదయం బుక్ చేసుకుందామని అనుకున్న రైతులకు మాత్రం యరియా దొరకని పరిస్థితి. ఇదే విషయమై వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సాంకేతిక సమస్యతో ముందుగానే యూరియా యాప్ ఓపెన్ అయిందని, ఇది గమనించిన రైతులు బుక్ చేసుకున్నారని తెలిపారు.
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని హరిచంద్‌తండాలో గిరిజనులకు విజ్ఞానజ్యోతి ఆధ్వర్యంలో పెరటికోళ్లు పంపిణీ చేశారు. బుధవారం హైదరాబాద్ బాచుపలి్‌ోల్లని విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధి కోసం ఎస్‌టీఐ–హబ్ (సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్) డీఎస్‌టీ ప్రాజెక్ట్ ద్వారా ఎంపిక చేసిన గిరిజన మహిళలకు పెరటికోళ్లు పంపిణీ చేశారు. వీటి పెంపకంపై తండాలోని మహిళలకు పలుమార్లు శిక్షణ ఇవ్వడంతోపాటు బాక్స్‌లు సైతం ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానజ్యోతి ప్రతినిధులు రాము, వీరేంద్రగోపి, దత్తేశ్, రాకేశ్, రామకృష్ణ, సర్పంచ్ సాలిబాయ్, రవీందర్, పంచాయతీ కార్యదర్శి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


