ఇబ్రహీంపట్నం రూరల్: అతివేగం ఒకరి ప్రాణం తీయగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. తుర్కయంజాల్ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అరుణ్(21) తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ నుంచి రావిర్యాల్ మీదుగా బొంగ్లూరు వైపు ప్రయాణిస్తున్నారు. రావిర్యాల్ చెరువు సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కేటీఎం బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొడుతూ వెళ్లి గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు మహేందర్ కాలు విరగడంతో పాటు తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. అరుణ్ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
● బైక్ అదుపుతప్పి విద్యార్థి దుర్మరణం
● మరో యువకుడి పరిస్థితి విషమం